మరుగుదొడ్లనూ వదల్లేదు | Fraud in Latrine constructions | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లనూ వదల్లేదు

Published Thu, Nov 23 2017 4:08 AM | Last Updated on Thu, Nov 23 2017 4:10 AM

Fraud in Latrine constructions - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం కాంట్రాక్టుల్లో కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లనూ విడిచిపెట్టటం లేదు. అక్కడ అంచనాలు పెంచి దండుకుంటుండగా... ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి కాజేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అసలు కాంట్రాక్టరు వ్యవస్థకే చోటు లేదు. నిర్మించుకున్న లబ్ధిదారుడికే నేరుగా బిల్లులు చెల్లించాలి. అయితే అధికార పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థల పేరుతో వీటిని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఉన్నవారికి కొత్తవి మంజూరు చేసి బిల్లులు చేసుకోవడం, ఒకే ఇంట్లో ఇద్దరి పేర్లతో రెండు మంజూరు చేయించడం, ఒకటే కట్టి రెండింటికి బిల్లులు చేసుకోవటం, అసలు కట్టకుండానే డబ్బులు డ్రా చేయటం లాంటి అక్రమాలకు పాల్పడుతు న్నారు. చాలా మంది పేదలు నిర్మాణ పనులన్నీ స్వయంగా చేపడుతున్నారు. అయితే కాంట్రాక్టర్లుగా మారిన అధికార పార్టీ నేతలు సిమెంట్, ఇసుక లాంటివి ఇచ్చి బిల్లు మాత్రం మొత్తం వారే తీసుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌ పథకంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం భారీగా నిధులు అందజేస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి విడుదల చేసిన నిధుల్లో రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికార పార్టీ నేతలు వెనకేసుకున్నట్లు అంచనా.

రూ.600 కోట్లు దొడ్డి దారిన స్వాహా!
స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో గత మూడేళ్లలో 12.57 లక్షల మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి రూ.1,813 కోట్లు బిల్లులు చేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మరో 2.92 లక్షల దొడ్లకు రూ.158 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. పథకం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇందులో కేంద్రం రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం రూ.4800 ఇస్తున్నాయి.

కేంద్రం సూచించినట్లుగా పెద్ద సైజులో మరుగుదొడ్డికి కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.మూడు వేలు కలిపి మొత్తం రూ. 15 వేలు ఇస్తోంది. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం గత మూడేళ్లలో రూ.992 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.838 కోట్లు కలిపి మొత్తం రూ.1,830 కోట్లను విడుదల చేసింది. ఇందులో మూడో వంతు అంటే రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికారపార్టీ నేతల జేబుల్లోకే చేరినట్లు అంచనా. ఈ కమీషన్లు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ పంచుకుంటున్నారు.

పంచాయతీ తీర్మానం పేరుతో పంపకాలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల లబ్ధిదారులకు అసలు మరుగుదొడ్డి మంజూరు అయినట్టు కూడా తెలియకపోవటం గమనార్హం. వారి పేరుతో చెల్లింపులు మాత్రం జరిగిపోయాయి. గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా అదేమీ లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి తాము చెప్పిన పేర్లతో మంజూరు చేయించారు. అవన్నీ తామే నిర్మిస్తామంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు పంపటంతో అధికారులు నేరుగా వారికే బిల్లులు చెల్లిస్తున్నారు.

పదేళ్ల క్రితం కట్టిన వాటికీ బిల్లులు
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన పశ్చిమ గోదావరిలోని నల్లజర్ల మండలం చీపిరిగూడెంకు గత మూడేళ్లలో రూ. 55.95 లక్షలు మంజూరు కాగా అందులో రూ. 37.20 లక్షలు గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల ఖాతాల్లోనే జమ అయ్యాయి. గ్రామ సర్పంచి చెల్లు ఎస్‌ఎస్‌ వరలక్ష్మి (బ్యాంకు ఖాతా నెంబరు 558938779, ఇండియన్‌ బ్యాంకు, నల్లజర్ల) రూ. 13.20 లక్షలు, తలంశెట్టి చినవెంకటేశ్వర్లు( బ్యాంకు ఖాతా నెంబరు 20269213265, ఎస్‌బీఐ, నల్లజర్ల) రూ. 12 లక్షలు, కూసంపూడి వెంకటేశ్వరరావు (బ్యాంకు ఖాతా నెంబరు 20162344981, ఎస్‌బీఐ నల్లజర్ల) రూ. 12 లక్షలు డ్రా చేసుకున్నారు.

సర్పంచి వరలక్ష్మి ఇంట్లో ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మించుకున్న పాత మరుగుదొడ్డికి కొత్తగా నిర్మించినట్టు బిల్లులు చెల్లించారు. ఒకే ఇంటికి చెందిన మామ కోడళ్లు చెల్లు వెంకటేశ్వర్లు, శిరీష పేరిట రెండింటిని మంజూరు చేయించి ఒక బిల్లు తాలూకు డబ్బులు నేతలే కాజేశారు. సూరమ్మ అనే వృద్ధురాలికి మంజూరైన మరుగు దొడ్డిని ఆమె ఇంట్లో కాకుండా మరోచోటకట్టారు. అదే ఊరిలో మరుగుదొడ్డి మంజూరు కాక నిర్మాణం మధ్యలో వదిలేసుకున్న వారూ ఉన్నారు.

ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకి రూ. 63.60 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలోనే నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామానికి రూ. 102.30 లక్షలు విడుదల కాగా అందులో రూ. 63.60 లక్షలు ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకే చేరాయి. గ్రామానికి చెందిన కామన విజయకుమార్‌ (బ్యాంకు ఖాతా నెంబరు 62206957261, ఎస్‌బీహెచ్, నల్లజర్ల) రూ. 49.95 లక్షలు, బండి సుబ్బారావు (బ్యాంకు ఖాతా నెంబరు 702101000059021, ఆంధ్రాబ్యాంకు, నల్లజర్ల) రూ. 13.65 లక్షలు డ్రా చేసుకున్నారు. పాత మరుగుదొడ్లకూ నిధులు మంజూరు చేయించుకున్నారు. కొందరు లబ్ధిదారులకు మాత్రం రూ. ఆరు వేల చొప్పున ఇచ్చారు.

అబ్బూరులో దొడ్లపై సర్పంచి శిలా ఫలకాలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరుకు గత మూడేళ్లలో 482 మరుగుదొడ్ల మంజూరు కాగా అవన్నీ తానే కట్టినట్లు సర్పంచి కట్టా రమేష్‌ రూ. 72.81 లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నారు. ప్రతి మరుగుదొడ్డిపైనా ఆయన పేరుతో శిలాఫలకాలు సైతం ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. అబ్బూరులో గద్దె వెంకట్రావు అనే వ్యక్తి మరుగుదొడ్డి గుంట నిర్మాణం చేపట్టి సిమెంట్‌ రేకులు సొంతంగా కొనుగోలు చేసుకున్నారు. ఆయనకు రావాల్సిన బిల్లు రమేష్‌ ఖాతాకే జమ అయింది. అక్కడ ఎస్టీ కాలనీలో 55 దాకా ఇళ్లు ఉంటే 68 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు చూపుతున్నారు.

ఆరు లక్షల దొడ్లకు కేంద్రం కోత
మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకోవటంతో రాష్ట్రానికి ఆరు లక్షల మరుగుదొడ్లను కేంద్రం కోత విధించింది. 2012 బేస్‌ లైన్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 71.20 లక్షల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉన్నవి పోగా ఏపీలో ఇంకా 28.20 లక్షల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసి నిధులు కోరింది. అయితే ఇప్పటికే మంజూరు చేసినవి పోనూ వీటి సంఖ్య 22.60 లక్షలకు మించి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 6 లక్షల మరుగుదొడ్లకు కోత విధిస్తున్నట్లు రాష్ట్రానికి సమాచారమిచ్చింది.


పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపిరిగూడెంలో భీమడోలు ఏసమ్మ (లబ్ధిదారురాలి నెంబరు 30958020) పేరుతో బిల్లులు మంజూరైనట్లు రికార్డుల్లో ఉన్నా డబ్బులు అమెకు చేరలేదు. డబ్బులేక ఆమె కుటుంబం మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేసింది. ప్రభుత్వం మాత్రం ఆ గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్లలో ముంగర సత్తెమ్మకు పథకం మంజూరైందని టీడీపీ నేత చెప్పటంతో ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు అప్పు చేసి మరుగుదొడ్డి కట్టుకున్నాడు. పనులు పూర్తయ్యాక బిల్లు కోసం ఆ ఊరి నేత వద్దకు వెళ్లగా మంజూరు  కాలేదని చెబుతున్నారు. కానీ సత్తెమ్మ (30941761 లబ్ధిదారుడి నెంబరు)కు ఏడాది కిందటే బిల్లులు చెల్లింపులు పూర్తయినట్టు అన్‌లైన్‌ డేటాలో ఉంది.


గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో పాత మరుగుదొడ్డికి బిల్లు మంజూరు చేయలేదని స్థానిక టీడీపీ నేత ఒకరు ఏడాది క్రితం ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై దాడి చేశారు. ‘గ్రామంలో 78 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వాటిల్లో 50 మరుగుదొడ్లను టీడీపీ నాయకులే నిర్మించారు. మిగిలిన వాటిల్లో కొన్ని గతంలో నిర్మించినవి కాగా మరికొన్ని అసలు కట్టకుండానే బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పట్ల, నాపై బెదిరింపులకు దిగారు. వారి మాట వినకపోవటంతో టీడీపీ నాయకులు గ్రామసభలో దాడి చేసి గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు’’ అని  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యనమాల ఎడ్వర్డ్‌  ‘సాక్షి’కి తెలిపారు.  
 

మరుగుదొడ్ల నిర్మాణానికి నాలుగేళ్లుగా విడుదలైన నిధులు(రూ. కోట్లలో)
రాష్ట్ర నిధులు  - 838.16   
కేంద్ర నిధులు  - 992.06
మొత్తం  - 1830.22
స్వాహా చేసింది  -  600


గుంటూరు జిల్లాలో గంపగుత్తగా మరుగుదొడ్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసిన సర్పంచి కట్టా రమేష్‌ ప్రతి దొడ్డిపైనా తన పేరుతో వేసుకున్న శిలాఫలకం


బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించిన గుంటూరు జిల్లా అబ్బూరులో ఇప్పటికీ మరుగుదొడ్డి లేని ఓ ఇల్లు

పశ్చిమ గోదావరి జిల్లా చీపిరిగూడెం గ్రామంలో ప్రభుత్వ పథకంలో సమర్త  మరియమ్మ ఇంట్లో  గ్రామ సర్పంచే నిర్మించారు. మూడు నెలలకే రోడ్డుపైన అది ఉందని కూల్చిన వేసిన వైనం.


ఛీపిరిగూడెం గ్రామంలో ఈమె పేరుతో మరుగుదొడ్డి మంజూరు అయింది. అయితే ఊళ్లో ఇంకొక చోట ఎక్కడో నిర్మించినట్టు నేతలు చెప్పడం డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న  వృద్ద మహిళ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement