జాక్‌పాట్‌ దగా..! | Farmers Vulnerable To Exploitation In The Tomato Market | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ దగా..!

Published Sat, Jul 20 2019 8:08 AM | Last Updated on Sat, Jul 20 2019 8:08 AM

Farmers Vulnerable To Exploitation In The Tomato Market - Sakshi

మదనపల్లె మార్కెట్‌ యార్డుకు వచ్చిన టమాటాలు 

పండ్లు, కూరగాయల రైతులకు మార్కెట్‌లో రుసుం రద్దుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్‌ యార్డులు, చెక్‌పోస్టుల్లో కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేశారు. ఇందుకు సంబంధించి జీఓ ఎంఎస్‌ నంబర్‌ 58ను తీసుకువచ్చారు. మదనపల్లె మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. సీఎం ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ ఇష్టారాజ్యంగా కమీషన్ల వసూళ్లకు పాల్పడుతూ జాక్‌పాట్‌ విధానాన్ని కొనసాగిస్తున్నారు. 

సాక్షి, మదనపల్లె టౌన్‌ : అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు దళారులకే అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారీలతో అధికారుల కుమ్మక్కై ఈ–వేలానికి మంగళం పలికి జాక్‌పాట్‌ విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. దీంతో రోజుకు రైతులు లక్షల్లో నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి వేలల్లో గండిపడుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లె టమాట మార్కెట్‌ యార్డుకు సరాసరిన 400 టన్నుల టమాటాలు వస్తున్నాయి.  ప్రస్తుతం పది కిలోల టమాటాలు రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ఇలా రోజుకు 4 లక్షల కిలోల టమాటాలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటికి ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.1.52 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో జాక్‌పాట్, కమీషన్‌ విధానంతో సుమారు రైతులకు  దాదాపు రూ.7.23 లక్షల మేర నష్టం కలుగుతోంది.
 
ఈ లెక్కన మార్కెట్‌ అధికారులు నెలవారీ చూపించే వ్యాపార లావాదేవీల్లో నామమాత్రపు వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు నివేదికలు చూపుతున్నారనే సమాచారం ఉంది. మార్కెట్‌లో దాదాపు 100కు పైగా 
మండీల యజమానులు ఉన్నారు. ఒక కమీషన్‌ మండీ ఏజెంట్‌ నెలకు రూ.50 లక్షల వ్యాపారం నిర్వహిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపుతున్నారు. మార్కెట్‌ యార్డుకు సెస్, వ్యాపార కమీషన్ల ద్వారా సంవత్సరానికి రూ.1.90 కోట్లు వరకు ఆదాయం చేకూరుతోంది. మార్కెట్‌ యార్డులో రైతులకు, వ్యాపారికి నేరుగా ఎటువంటి సంబంధాలు ఉండవు. రైతు తీసుకొచ్చిన సరుకు కమీషన్‌ ఏజెంట్‌ ద్వారా విక్రయాలు జరుగుతాయి. కమీషన్‌ ఏజెంట్లు వ్యాపారుల మధ్య ముందుగానే వ్యాపారలావాదేవీల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రైతు, వ్యాపారికి కమీషన్‌ ఏజెంటే మధ్యవర్తిగా వ్యవహరించి టమాటాలను జాక్‌పాట్, కమీషన్‌ పద్ధతిలో బహిరంగ వేలం నిర్వహిస్తాడు. వ్యాపారి నుంచి నగదును తీసుకుని తన కమీషన్‌ మినహా మిగిలిన మొత్తాన్ని రైతుకు అందజేస్తాడు.

సీఎం ఉత్తర్వులు బేఖాతర్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత వారం రైతులు పండించే పంటలకు కమీషన్‌ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలను ఇక్కడి అధికారులు మాత్రం ఖాతరు చేయడంలేదు. వ్యాపారులు, మండీల నిర్వాహకులతో కుమ్మక్కై యథేచ్ఛగా రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. 

మోసం జరుగుతోంది ఇలా..
రైతులు తీసుకువచ్చిన టమాటాలను తనకు ఇష్టమొచ్చిన కమీషన్‌ మండీల్లో విక్రయించేందుకు సంబంధిత కమీషన్‌ ఏజెంట్‌తో వ్యాపారి ముందుగానే ఒప్పందం కుదర్చుకుంటారు. ఉదాహరణకు మండీకి ఓ రైతు 50 క్రేట్లు టమాటాలు తీసుకెళ్తే కమీషన్‌ ఏజెంటు 10 క్రేట్‌లకు ఒక క్రేట్‌ (35 కేజీలు) జాక్‌పాట్‌ కింద తీసుకుంటాడు. క్రేట్‌కు లెక్కప్రకారం 30 కేజీలు భర్తీ చేయాల్సివుండగా అదనంగా ఐదు కిలోలు మండీ వ్యాపారులు తీసుకుంటున్నారు. 50 క్రేట్‌లకు గాను ఐదు క్రేట్‌లు జాక్‌పాట్‌ కింద ఉచితంగా తీసుకుంటాడు. వంద క్రేట్లకు పది క్రేట్లు బలవంతంగా రైతుల నుంచి కమీషన్‌ మండీల నిర్వాహకులు తీసుకుంటారు. వీటిని వాస్తవిక లెక్కల్లో చూపరు. ఈ కాయలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వ్యాపారి, అధికారులతోపాటు మండీల నిర్వాహకులు పంచుకుంటారు.
 
తరుగు పేరుతో మెలిక
ఒక క్రేట్‌ టమాటాలను రూ.500 వేలం పాటలో పాడితే రైతుకు డబ్బులు ఇచ్చే బిల్లులో తరుగు పేరుతో మెలిక పెట్టి రూ.10 నుంచి 20 తగ్గించి రూ.480 మాత్రమే అందజేస్తున్నారు. బిల్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నాలుగు శాతం కమీషన్‌ తీసుకోవాలని నిబంధనలు ఉన్నా ఏజెంట్లు దీన్ని 10 నుంచి 30 శాతానికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా వసూలు అయిన దాంట్లో మండీ ఓనర్‌కు క్రేట్ల బాడుగ పేరుతో రూ.5 నుంచి 10 రూపాయలు, దింపే కూలీలకు లెస్‌ పేరుతో మరో రూ.5, నూటికి రూ.10 కమీషన్, వ్యాపారికి రిటర్న్‌ కమీషన్‌ తీసేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా చివరగా 100కి రూ.10 కమీషన్‌ పట్టుకుంటూ డబ్బులు ఇచ్చే సమయంలో కాయలు నాణ్యత లేవనో, తరుగు ఉందనో ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ నింబ«ంధనలన్నీ పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలివేయడంతో కమీషన్‌ మండీల నిర్వాహకులకు, వ్యాపారులకు వరంగా మారింది. 

అంతా చట్టవిరుద్ధం
మదనపల్లె టమాటా మార్కెట్లో ఈ–వేలం పద్ధతిలో టమాటాలను రైతుల నుంచి మండీల నిర్వాహకులు, వ్యాపారులు మార్కెట్‌ అధికారులు కలసి ముందుగానే రైతులతో సమావేశమై ఆన్‌లైన్‌ విధానంతో ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి ధరలు పలుకుతాయి. ఇలా చేయడం వల్ల రైతులు ఎక్కువ శాతం కమీషన్‌ నష్టపోకుండా ఉంటారు. జాక్‌పాట్‌ లేకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నష్టాలు ఉండవు. అయితే ఇక్కడంతా చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్లోని మండీలకు తీసుకువచ్చిన టమాటాలను ఈనాం పద్ధతిలో వేలం వేస్తున్నామని మార్కెట్‌ అధికారులు రికార్డుల్లో నమోదుచేస్తూ బహిరంగ వేలం ద్వారా క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ రైతులను బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మార్కెట్‌ అధికారులే దగ్గరుండి మరీ రైతులను ఏమార్చి నష్టపరస్తున్నారు.

రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా
పదిహేను రోజులు గడువిచ్చాం.. ట్రేడర్‌ లైసెన్సులు పొందాలి. నోటీసులు ఇచ్చి రద్దుపరచినట్లు తెలియజేశాం. కమీషన్‌ తీసుకోకూడదని చెప్పాం. అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. మార్కెట్‌ యార్డులో జాట్‌పాట్‌ పద్ధతి లేకుండా చేస్తా. ఇందుకోసం త్వరలో టమాటా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. అధిక కమీషన్‌ వసూలుచేసే వారిపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు నివేధిస్తాం.   – జగదీష్, మార్కెట్‌ ఇన్‌చార్జి సెక్రటరీ, మదనపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement