వైద్యశాలలోని స్టోర్‌లో ఉన్న మందులు
తెనాలి జిల్లా వైద్యశాలలో మందుల కొనుగోలు వ్యవహారంలో అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి టెండర్లు పిలవకుండా ఒకే ఏజెన్సీతో ఏడాదికి ఒకసారి ఒప్పందం చేసుకుంటున్నారు. నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెనాలిఅర్బన్: తెనాలి పట్టణంలో 250 పడకలతో జిల్లా వైద్యశాల, 150 పడకలతో తల్లీపిల్లల వైద్యశాలను ఏర్పాటు చేశారు. తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాల పరిధిలోని పేదలు ఇక్కడికి వచ్చే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజు రెండు వైద్యశాలలో సుమారు వెయ్యి మంది ఓపీ సేవలు అందుకుంటున్నారు. వీరు కాకుండా సుమారు 300 మంది ఇన్‌పేషెంట్‌గా ఉంటున్నారు. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేస్తుంది.
ఏడాదికి రూ.50 లక్షల బడ్జెట్ :వైద్యశాలలో అవసరమైన మందుల కోసం ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి సుమారు రూ. 5లక్షల బడ్జెట్‌ను విడుదల చేస్తుంది. దీనిని బట్టి ఏడాదికి నాలుగు క్వార్టర్‌లుగా రూ.20లక్షల బడ్జెట్ విడుదల చేస్తారు. ఇది కాకుండా గైనిక్, పిడియాట్రిక్ విభాగాలలోని సేవల కోసం, జనని శిశు సంరక్షణ కింద మందుల కొనుగోలు కోసం ఏడాదికి సుమారు రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇది కాకుండా ఎస్‌ఎన్‌సీయూ వార్డులోని సేవల కోసం సుమారు రూ.10లక్షలు మంజూరు చేస్తుంది. దీనిని బట్టి ఏడాదికి వివిద విభాగాలలోని రోగుల కోసం ఏడాదికి మందుల కోసం ప్రభుత్వం సుమారు రూ.50లక్షల నిధులను విడుదల చేస్తుంది.
లోకల్ పర్చేజ్ కోసం రూ. 24లక్షల కేటాయింపు :జిల్లా వైద్యశాలకు కేటాయించిన బడ్జెట్ అధారంగా గుంటూరులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు వెళ్లి అందుబాటులో ఉన్న మందులను తెనాలి తీసుకు వస్తుంటారు. అక్కడ అందుబాటులో లేని వాటిని లోకల్ పర్చేజ్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇటీవల కాలంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అన్ని రకాల మందుల లభ్యత ఉండటం లేదు. దీంతో జిల్లా వైద్యశాల అధికారులు అందుబాటులో లేని మందులను లోకల్ పర్చేజ్ కింద కొనుగోలు చేసి, అస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి ఆయా బిల్లులను చెల్లిస్తున్నారు. మందుల కొనుగోలు కోసం జిల్లా వైద్యశాల అధికారులు నెలకు సుమారు రూ.2లక్షల నిధులు కేటాయిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.24లక్షలు వీటి కోసం వెచ్చిస్తున్నారు.
మందుల కొనుగోలులోనిబంధనలకు పాతర
సాధారణంగా మందులను లోకల్‌గా పర్చేజ్ చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, తక్కువకు కోడ్ చేసిన మందుల ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లా వైద్యశాలలో అలాంటిదేమి లేకుండా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి లోకల్ పర్చేజ్ కింద మందులు కొనుగోలు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల కిందట ఒక మందుల ఏజెన్సీతో ఏడాదికి ఒకసారి ఒప్పందం చేసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీనిపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఆస్పత్రి అధికారులు స్పందించి వెంటనే మందుల లోకల్ పర్చేజ్‌ని నిబంధనలకు అనుగుణంగా జరిపితే చాలా వరకు నిధులు మిగిలే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment