పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ | urban health centers | Sakshi
Sakshi News home page

పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ

Published Thu, Dec 11 2014 12:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

urban health centers

 పేదల కోసం ప్రభుత్వం పట్టణ, కార్పొరేషన్ శివారు ప్రాంతాలు, మురికివాడల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. వైద్య సిబ్బంది కొరత, మందులు లేకపోవటం, వైద్య పరికరాల లేమి, ఉన్న సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాల వల్ల పేదలకు వైద్య సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో  వీటిని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 
 గుంటూరు మెడికల్ : పట్టణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో వైద్య సిబ్బందిని, ఆరోగ్య కేంద్రాల పరిధిని పెంచుతూ ఏడాది కిందట ఉత్తర్యులు జారీ చేసింది. అందులో భాగంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహించేందుకు సిద్ధమైంది.
 
 నోటిఫికేషన్ ద్వారా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించేందుకు, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల పనితీరుపై సర్వే చేసేందుకు ప్రభుత్వం గ్రూప్-1 అధికారి అరుణాదేవిని అర్బన్‌హెల్త్ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించింది.
 
 జిల్లా వైద్యాధికారులతో కలసి అరుణాదేవి ఈ నెల 8, 9 తేదీలలో పలు పట్టణ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగులు, పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు, అందిస్తున్న మందులు, ఏ తరహా రోగులు అధికంగా వస్తున్నారు, ఆరోగ్య కేంద్రం భవనం వినియోగించేందుకు అనుకూలంగా ఉందా లేదా తదితర అంశాలపై నివేదిక రూపొందించి రాష్ట్ర అధికారులకు సమర్పించనున్నారు.
 
 ఈ నెలాఖరు లేదా జనవరి నాటికల్లా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
 
 పట్టణ ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించేందుకు జిల్లా ప్రోగ్రామ్ మే నేజర్, జిల్లా అకౌంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
 
 2005 నుంచి జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ద్వారా అన్ని ఆస్పత్రులకు నిధులు సమకూర్చి ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి పట్టణ ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేందుకు  అర్బన్‌హెల్త్ మిషన్ కార్యక్రమం ప్రారంభించింది.
 
 రోగులకు కలిగే ప్రయోజనాలు...
 గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మిగతా మునిసిపాలిటీల పరిధిలో మరో 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
 
 అర్బన్‌హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ జనాభా 10వేల మందికి ఒక ఏఎన్‌ఎం, రెండువేల జనాభాకు ఒక ఆశా వర్కర్, 50 వేల జనాభాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేయటం వల్ల పట్టణాల్లో ఉండే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయి.
 
 వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు నూతనంగా రావటంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు లభించటంతో పాటు,పలువురికి ఉద్యోగాలు వస్తాయి.
 
 రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా పట్టణ రోగుల ఆరోగ్య సేవల కోసం బడ్జెట్‌ను ఏడాది ముందుగానే విడుదల చేయనుంది. దీంతో వైద్యసేవలకు నిధుల సమస్య ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement