సాక్షి, గుంటూరు: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం అందించిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మా రాయి. ఉచితంగా ఔట్ పేషెంట్(ఓపీ) వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు వైద్యులు ససేమిరా అంటున్నారు. జిల్లాలో ఉద్యోగులు, పెన్షనర్లు సుమారు 90 వేల మంది వరకు ఉన్నారు. హెల్త్ కార్డులు మంజూరై రెండు నెలలు దాటుతోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే వైద్య సేవలు అందించేందుకు
నిరాకరిస్తున్నారు. హెల్త్‌కార్డుల్లో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు తమకు సరిపోవని, ఓపీ సేవలు ఉచితంగా అందించలేమని ప్రైవేటు వైద్యులు తెగేసి చెపుతున్నారు. దీనిపై ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పట్టించుకోవడంలేదు. చివరకు నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిలిపివేస్తామని బెదిరించినప్పటికీ వెనక్కు తగ్గలేదు.
ఇదిలావుంటే, ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ వైద్యశాలల్లో సైతం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులపై ఓపీ సేవలందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 20వ తేదీ వస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ కేంద్రాలనే ఏర్పాటు చేయలేదు. హెల్త్‌కార్డులపై ఓపీ సేవలు అందించినందుకు మామూలు వైద్యమైతే రూ. 50, సూపర్ స్పెషాలిటీ వైద్యమైతే రూ. 100 పారితోషికాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ వైద్యులు పట్టించుకోవడం లేదు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండాలి, డ్యూటీ సమయంలోనే ఉద్యోగులకు ప్రత్యేకంగా ఓపీ చూడటానికి ప్రభుత్వ వైద్యులకు ఉన్న అభ్యంతరాలు ఏమిటో తెలియడం లేదు. సాయంత్రం వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉండాల్సిన వైద్యులు అధిక శాతం మంది మధ్యాహ్నం 1 గంటకల్లా తమ ప్రైవేటు వైద్యశాలలకు చెక్కేస్తున్నారు.
ఉద్యోగులకు ప్రత్యేక ఓపీ సేవలు అందించే ప్రక్రియ ప్రారంభిస్తే సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుందనే కారణంతో ప్రభుత్వ వైద్యులు సైతం దీన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై
గందరగోళం...
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో ఇక మెడికల్ రీయింబర్స్‌మెంట్ అవసరం లేదని వెంటనే నిలిపివేయాలని ఈ ఏడాది అక్టోబర్ 29న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
అక్టోబర్ 29వ తేదీకి ముందు వైద్యసేవలు పొంది బిల్లులు పంపిన వారికి మాత్రమే రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆ తరువాత నుంచి నిలిపి వేయాలని ఆదేశించింది. గతంలో ఉద్యోగులు ముందు డబ్బు ఖర్చు చేసి వైద్యసేవలు పొందితే అందులో కేవలం 60 శాతం మాత్ర మే మెడికల్ రీయింబర్స్‌మెంట్ ద్వారా తిరిగి వచ్చేది.
ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసినప్పటి నుంచి అటు వైద్యసేవలు అందక, రీయింబర్స్‌మెంట్ లేక ఉద్యోగులు, పెన్షనర్‌లు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హెల్త్‌కార్డుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడమో లేదా మెడికల్ రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తూ జీవో ఇవ్వడమో చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.
ఉచితం హుళక్కే!
Published Fri, Dec 19 2014 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement