వరి రైతులకు అండగా పంటల బీమా | Government Give Help To The Farmers In Guntur | Sakshi
Sakshi News home page

వరి రైతులకు అండగా పంటల బీమా

Published Mon, Aug 5 2019 7:21 AM | Last Updated on Mon, Aug 5 2019 7:22 AM

Government Give Help To The Farmers In Guntur - Sakshi

వేమూరు మండలంలో వర్షాలకు నీటి మునిగిన వరి ఓదెలు 

సాక్షి, గుంటూరు: రూపాయితో పంటల బీమా పథకం రైతుకు వరంగా మారింది. దీనిని సద్వినియోగం  చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నా తగిన ప్రచార లోపం, ఆన్‌లైన్‌లో నమోదుకు సాంకేతిక సమస్య, మీసేవ కేంద్రాల నిరాసక్తత, కొన్ని బ్యాంకుల అవగాహన లోపంతో లక్ష్యం ఆమడదూరంలో నిలుస్తోంది. వాణిజ్య, ఉద్యాన పంటలకు బీమా గడువు ముగిసినందున, వరి పంటకు బీమాలో ఈ సమస్యలను అధిగమించే చర్యలు తీసుకుంటే మరింత సంఖ్యలో రైతులు నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా వరి సాగు రైతులు 2.05 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 35 వేల మంది మాత్రమే బీమా చేయించుకున్నారు. అన్ని పంటలకుగాను వైఎస్సార్‌ బీమా ద్వారా 8,40,949 మంది లబ్ధి పొందనున్నారు.  ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రంలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూపాయి ప్రీమియంతోనే పంటకు బీమా చేయటం ఇందులోని వెసులుబాటు. ప్రీమియం తగ్గించటమే కాకుండా పంటల నష్టానికి చెల్లించే పరిహార మొత్తాన్ని పెంపుదల చేయటం, పంట నష్టాన్ని గుర్తించేందుకు నాలుగు రకాలుగా వెసులుబాటు కల్పించటం నూతన పథకంలో విశేషం. ఇంతకు ముందు వరి రైతుకు ఎకరాకు బీమా పరిహారం రూ.25 వేలుండేది. ఈ మొత్తాన్ని తాజా పథకంలో రూ.32 వేలకు పెంచారు. ప్రీమియంలో రైతు వాటాగా 2 శాతం (రూ.640) చెల్లించాల్సి వచ్చేది. బ్యాంకులో పంట రుణాలు తీసుకొనేటపుడు బీమా ప్రీమియం కింద రూ.520 మినహాయించే వారు. నూతన పథకంలో వీరందరి వద్ద కేవలం రూపాయిని టోకెన్‌ మొత్తంగా తీసుకుని బీమా కల్పిస్తున్నారు.

గతంలో పంట వేసి, కోత కోసేవరకు మధ్యలో ఏదైనా కారణంతో పంట దెబ్బతింటేనే బీమా వర్తించేది. పంట వేయలేకపోయినా, పంట కోశాక నష్టం సంభవించినా బీమా పరిహారం పొందేందుకు వీలుండేది కాదు. దీనిని గుర్తించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో నాలుగు రకాల వెసులుబాట్లు కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లో పంట వేయలేకపోయినప్పుడు బీమా మొత్తంలో 25 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తారు. పంట మధ్యకాలంలో వాతావరణ మార్పులు, దోమపోటు ఉధృతితో దెబ్బతింటే 50 శాతం, వడగళ్లవాన, అగ్ని ప్రమాదాలతో నష్టపోతే 50 శాతం పరిహారం ఇస్తారు. డెల్టాలో వచ్చే తుపాన్లను దృష్టిలో ఉంచుకొని పంట కోశాక 14 రోజుల్లోపు పంట దెబ్బతింటే నూరుశాతం పరిహారం చెల్లిస్తారు.
 
కౌలు రైతులకూ వరమే..
పంటరుణానికి వెళ్లని భూమి యజమానులే కాదు, కౌలురైతులు కూడా పంటకు బీమా చేయించేందుకు ముందుకొస్తున్నారు. కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా గుర్తించిన మీసేవ కేంద్రాల్లోనే బీమాపై ఆన్‌లైన్‌ నమోదుకు అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం పోర్టల్‌లోకి వెళ్లి నమోదు చేయాలి. ఇందుకోసం రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, కౌలురైతులైతే ఒప్పంద పత్రంతో వెళ్లాలి. ఇలా నమోదైన వివరాలన్నీ ప్రభుత్వానికి వెళతాయి. ఆ ప్రకారం ప్రభుత్వం రైతుల తరపున నిర్ణయించుకున్న ప్రీమియంను బీమా కంపెలకు జమ చేస్తుంది.

సాంకేతిక సమస్య
సర్వర్‌ మొరాయిస్తుండటం ప్రధాన సమస్యగా మారింది. మీసేవ కేంద్రాల్లో (కామన్‌ సర్వీస్‌ సెంటర్లు) విపరీతమైన జాప్యం జరుగుతోంది. మరికొందరైతే ‘మధ్యాహ్నం రండి...రేపు రండి...బిజీగా ఉన్నాం..సర్వర్‌ ప్రాబ్లం’ అంటూ మీసేవ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.  కొన్ని బ్యాంకు శాఖలు కూడా బీమా రెన్యువల్‌ చేసేందుకు ఆసక్తి చూపటం లేదని రైతుల ఫిర్యాదు చేస్తున్నారు. తెనాలిలోని ఒక గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు రూపాయి టోకెన్‌ మొత్తంగా తీసుకుని బీమా నమోదు చేయమంటే, నీళ్లు నమిలారట! కంప్యూటర్లో కాసేపు వెరిఫై చేసి, తమకు సమాచారం లేదనో/క్లారిఫికేషన్‌ సరిగా లేదనో? సాధ్యపడదని చెప్పటంతో, ‘మీసేవ’కు వెళ్లి నమోదు చేయించినట్టు పెదరావూరు రైతు ఒకరు చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement