మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు | Free health tests for women | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

Published Wed, Mar 9 2016 3:16 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - Sakshi

మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

35 ఏళ్లు దాటిన వారికి వర్తింపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం హామీలు

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: 35 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఉచితంగా అన్ని రకాల పరీక్షలను అందుబాటులోకి తెస్తామని.. ఇందుకోసం మాస్టర్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో స్త్రీ వ్యాధి నిపుణులురాలు ఉండేలా 200 మంది డాక్టర్ల నియామకాలను చేపడతామన్నారు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉగాది రోజున డిజిటల్ మార్కెట్‌కు శ్రీకారం చుడతామన్నారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు ఇందుకోసం ముందుకు వచ్చాయన్నారు.

డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించేం దుకు వాల్‌మార్ట్, ఐటీసీ వంటి కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 2016-17లో ప్రతి పేద మహిళకూ వంటగ్యాస్ కనెక్షన్లు మం జూరు చేస్తామని.. వాటిని ఇప్పించే బాధ్యత డ్వాక్రా సంఘాలదేనన్నారు. ఉపాధి నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలు, పొదుపు సంఘాలకు భవనాలు నిర్మించి ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలు నెలకు రూ.10 వేలు సంపాదించేలా చేయడమే తన లక్ష్యమన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో బాలికాశక్తి పేరుతో బృందాలను ఏర్పాటు చేసి, కరాటే శిక్షణ ఇప్పిస్తామన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని.. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి విడతలో 82 లక్షల మందికి రూ.3 వేల కోట్లు విడుదల చేశామని సీఎం పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాల కింద రూ.1,400 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో మిగిలిన నిధులనూ విడుదల చేస్తామన్నారు.

 50 వేల కిరాణా దుకాణాలు
 రాష్ట్రంలో మహిళాభివృద్ధికి 20 పాయింట్ల కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో ఒకరు కంప్యూటర్ వచ్చిన వారు ఉండాలని, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం వంటివి ఉన్నాయన్నారు. జీపీఎస్ విధానం ద్వారా నడిచే వాహనాలను మహిళలకు అప్పగిస్తామని.. వీటిని పర్యవేక్షించేందుకు ఐజీ స్థాయి అధికారితో కంట్రోలు రూం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో నర్సరీల పెంపకాన్ని డ్వాక్రా సంఘాలకు అప్పగించామని.. త్వరలో వారి ఆధ్వర్యంలో 50 వేల కిరాణా దుకాణాలతోపాటు హోటల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రూ.15 వేలు మంజూరు చేస్తామన్నారు. కేవ లం ఈ ఒక్క ఏడాదిలోనే డ్వాక్రా సంఘాలకు రూ.12,500 కోట్ల రుణాలు మంజూరు చేయిం చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

 పొదుపు రుణాల్లో మనమే టాప్
 భారతదేశంలో పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో 37 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇప్పిస్తున్నామన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రానికి పంపనున్నట్టు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని.. ఆడబిడ్డలను చదివించాల్సిన అవసరం ఉందన్నారు.
 
 22 మంది మహిళా ప్రతిభావంతులకు అవార్డులు
 కర్నూలు (అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా ప్రతిభావంతులకు సీఎం చంద్రబాబు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందించారు. మొత్తం 22 మంది మహిళలను అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి (విజయవాడ), క్రీడలు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి గొల్ల విజయశ్రీ గుప్తా (విజయవాడ), జి.రాధారాణి (విజయవాడ), పర్వతారోహణలో డా.మల్లీదొరసానమ్మ (నెల్లూరు), సినీరంగంలో డాక్టర్ జయసుధా కపూర్ (రంగారెడ్డి), ప్రీస్కూల్ మేనేజ్‌మెంట్ నన్నపనేని మంగాదేవి (గుంటూరు), రచయత్రి యద్దనపూడి సులోచనారాణి, గాయకులు ఎస్పీ శైలజ, వాణీజయరామ్, జానకి, నెల్లూరు కలెక్టర్ ఎం.జానకి, గుంటూరు డీఎస్పీ సరిత, అమరావతికి రూ.కోటి విరాళం ఇచ్చిన దాత ముప్పవరపు స్వరాజ్యం (గుంటూరు), ఆల్ ఇండియా రేడియో డెరైక్టర్ ఎం.క్రిష్ణకుమారి (విజయవాడ), నృత్యకారిణి వింజ మూరి సుజాత (హైదరాబాద్), ఆశాజ్యోతి హ్యాండీక్యాప్డ్ సొసై టీ కార్యదర్శి ఎం.మాధవీలత (పశ్చిమగోదావరి), సామాజిక సేవా రంగంలో ఎల్లా పద్మలత (తూర్పు గోదావరి), దీపా వెంకట్ (నెల్లూరు), ట్రెసా (విజయవాడ), జ్ఞాపకశక్తికి సంబంధించి బేబీ బోడెపూడి వీక్షిత(హైదరాబాద్), వ్యవసాయ రం గంలో ఎ.సరస్వతి (కర్నూలు), ఆలూరి విజయ (విజయనగరం)లకు అవార్డులను ప్రకటించారు. వీరిలో వేడుకలకు హాజ రైన వారికి సీఎం ప్రశంసా పత్రాలను అందించారు.
 
 అభయం యాప్..
 మహిళల రక్షణకు ప్రత్యేకంగా అభయం యాప్‌ను ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. బాధిత మహిళలు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ కల్పిస్తారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో గ్రిల్ ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తామన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఇకపై ఏటా మహిళా దినోత్సవం రోజున అవార్డులు అందజేస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement