మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి | Cm chandrababu about Womens welfare | Sakshi
Sakshi News home page

మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి

Published Wed, Mar 9 2016 5:43 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి - Sakshi

మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి

♦ వారికి ఎంతో చేశాం... శాసనసభలో చంద్రబాబు
♦ స్త్రీ, పురుష సమానత్వ సాధనకు కట్టుబడి ఉన్నాం
♦ వచ్చే ఏడాది నుంచి వివిధ రంగాల్లో నిపుణులైన మహిళలకు అవార్డులు
♦ అభయం యాప్,181 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు చర్యలు

 చరిత్రను తిరగరాయలేరు. మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి. మహిళలకు అన్నీ మేమే చేశాం. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సమత్వ ప్రతిజ్ఞ, 2030 నాటికి స్త్రీ, పురుష సమానత్వ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో మగ పిల్లలే కన్యాశుల్కం చెల్లించి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే పరిస్థితి రానుంది.    
 - అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

 సాక్షి, హైదరాబాద్: ‘చరిత్రను తిరగరాయలేరు. మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి. మహిళలకు అన్నీ మేమే చేశాం...’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చంద్రబాబు మంగళవారం శాసనసభలో సుదీర్ఘ ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సమత్వ ప్రతిజ్ఞ, 2030 నాటికి స్త్రీ పురుష సమానత్వ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐటీ కంపెనీల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్‌లో మగ పిల్లలే కన్యాశుల్కం చెల్లించి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే పరిస్థితి రానున్నదని చెప్పారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం చేపట్టిన కార్యక్రమాలను చదివి వినిపించారు. స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రూ.1,350 కోట్ల వడ్డీ మాఫీ తమ ఘనతగా చెప్పుకున్నారు. రుణ అనుసంధానంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. 3 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు మొబైల్ ద్వారా ఇంటర్‌నెట్ వాడకం, కంప్యూటర్ వినియోగంపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో ప్రతి స్వయం సహాయక బృందం సభ్యురాలికీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లీ బిడ్డలను ఉచితంగా వారి ఇంటికి చేర్చేందుకు 279 నంబర్‌తో తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వ్యాన్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అంగన్‌వాడీల జీతాలను పెంచామని, సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు.

 తల్లీ బిడ్డల కోసం ఆస్పత్రులు
 రాష్ట్రంలో తల్లీ బిడ్డల కోసం పది ఆస్పత్రులు నిర్మించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ‘గర్భిణీ స్త్రీలకు ఉచితంగా టెలీ అల్ట్రా సోనోగ్రఫీ సేవలు అందిస్తాం. త్వరలోనే 200 మంది గైనకాలజిస్టులను నియమిస్తాం. ఉచిత సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు మాస్టర్ హెల్త్‌కార్డులు ఇస్తాం. బాల్య వివాహాల నిరోధానికి వీలుగా ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేయిస్తాం. అభయం పేరిట యాప్ ఏర్పాటుచేసి కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేస్తాం. మహిళలపై వేధింపుల నిరోధానికి 181 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన 25 మంది మహిళలకు అవార్డులిస్తాం. ఏటా పది వేల చొప్పున అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మిస్తాం. మహిళా సంబంధిత కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం పార్ట్టిషన్ (ప్రత్యేక స్థలం) ఏర్పా టు చేస్తాం. 2016-17లో ప్రతి ఇంటికీ గ్యాస్, 2019-20 నాటికి మరుగుదొడ్డి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని బాబు పేర్కొన్నారు. కూచి పూడి నృత్య కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.
 
 మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
 శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

 చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రతిపాదించారు. తమ పక్షానికి చెందిన మహిళా శాసనసభ్యురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు, వివరణలకు అవకాశం కల్పించిన తర్వాత తీర్మానం ప్రతిపాదించాలని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కోరారు. అయితే సీఎం ఈ విషయాన్ని పట్టించుకోకుండా విపక్ష సభ్యుల స్వల్ప నిరసనల మధ్యే తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ప్రతిపాదించిన తర్వాత వివరణలకు అవకాశం ఉండదంటూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం ఆమోదిస్తేనే ఇది చట్టరూపం దాల్చుతుందని స్పీకర్ వివరించారు. అనంతరం మహిళల సమానత్వం, ప్రగతికి పాటుపడతామంటూ సభ్యులందరితో స్పీకర్ ప్రమాణం చేయించారు. ‘మహిళలు, బాలికల ఆశ యాల సాధన కోసం సహకరిస్తాను. తెలిసిగానీ, తెలియకగానీ మహిళల పట్ల జరిగే వివక్షను ప్రతిఘటిస్తాను. స్త్రీ, పురుష సమానత్వ నాయకత్వాన్ని ఆహ్వానిస్తాను. స్త్రీ, పురుష భావాలకు, చర్యలకు సమానమైన విలువ ఇస్తాను. మహిళలను కలుపుకునేందుకు అనువైన సంస్కృతిని సృష్టిస్తాను. మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు నేను ప్రయత్నిస్తాను...’ అంటూ సభ్యులంతా ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement