
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని.. న్యూయార్క్‌లో జరిగే వేరే సమావేశానికి వెళుతూ ఇలా డప్పు కొట్టుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐక్యరాజ్య సమితి ఆహ్వానాన్ని ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. శనివారం విజయవాడలోని బీజేపీ కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐరాసలో జరిగే సమావేశాలకు చంద్రబాబు వెళ్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు వెళ్తుంది వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ.. బ్లూమ్‌బర్గ్ అనే వాణిజ్య సంస్థతో కలిసి నిర్వహించే సమావేశానికి. అది ఐరాస భాగస్వామి సంస్థ కాదు. మరే ప్రభుత్వ సంస్థ కూడా కాదు.
కనీసం ఐరాస చెబితే నిర్వహిస్తున్న సమావేశం కూడా కాదు. అసలు జరిగే సమావేశమేంటి? దాని గురించి మీరిచ్చే దొంగ బిల్డప్ ఏంటి? ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి అవమానం అవసరమా’ అంటూ జీవీఎల్ తూర్పారపట్టారు. ఇది ప్రజలను వంచించడం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నందనే తాను ఈ విషయాలు చెప్పాల్సి వస్తోందన్నారు. తాజ్ మహల్ ఫైవ్‌స్టార్ హోటల్ పక్కనే తాజ్‌మహల్ అనే డాబా కూడా ఉంటే.. ఆ డాబాకు వెళ్లి తిని వచ్చి, నేను ఫైవ్‌స్టార్ హోటల్‌లో తిని వచ్చానంటూ డబ్బా కొట్టుకోవడం లాంటిదే ఇదని ఎద్దేవా చేశారు. ఐరాసలో సమావేశాలు జరుగు తున్నప్పుడు, దాని పక్కనే మన ప్రచారం కోసం ఒక ఈవెంట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సమావేశం కూడా అలాంటిదేనన్నారు. ఏ పత్రిక అయినా కూడా అలాంటి సమావేశాలు పెట్టవచ్చని.. తమ లాంటి వారిని ఎవరినైనా ఆహ్వానించవచ్చన్నారు.
మీడియా కూడా ధ్రువీకరించుకొని ప్రచురించాలి..
‘కొన్ని పత్రికలైతే ఐరాస ప్రధాన భవనంలోనే సమావేశం జరుగుతుందని రాశాయి. ఇంకా నయం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పక్కనే చంద్రబాబు కూర్చుంటారని రాయ లేదు. రేపు.. చంద్రబాబు ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ అది ఐక్యరాజ్యసమితి మెయిన్ హాల్ అని చెప్పుకుంటే.. పత్రికల వాళ్లు కూడా తెలియక అదే నిజమనుకుంటారు. మీడియా సంస్థలకు నా విన్నపం ఒక్కటే. ఇప్పటికే కొంత బిల్డప్ ఇచ్చేశారు. తెలియక చేశారని అనుకుంటున్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ధ్రువీకరణ లేకుండా రాయకండి’ అని జీవీఎల్ సూచించారు. ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు వ్యవహారాలు మానుకోవాలని హితవు పలికారు. మీ డప్పు కోసం రాష్ట్రాన్ని కించపరచొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment