నెల్లూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సీఎం చంద్రబాబుకు అంగన్‌వాడీ మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తన ప్రభుత్వం ఎన్నో చేస్తోందంటూ ప్రసంగించబోయిన బాబుపై సదరు మహిళలు.. ‘మాకేం చేశావంటూ..’ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. గతంలో అధికారంలో ఉండగా అంగన్‌వాడీ కార్యకర్తలను హీనంగా చూసి.. వేతనాల కోసం రోడ్డెక్కితే గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. మారాడని నమ్మి ఓట్లేసి తిరిగి అధికార పీఠం ఎక్కించామని, అయితే, ఇప్పుడు కూడా ఆయన మోసపూరిత వైఖరినే అవలంబిస్తున్నారంటూ వందల సంఖ్యలో మహిళలు బాబుపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన చంద్రబాబు.. మహిళలపై ప్రతిదాడికి దిగారు. ‘మీరేం చేసినా చూస్తూ ఊరుకోం’ అంటూ పోలీసులను పురమాయించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు సహనం కోల్పోయి మహిళలపై మండిపడ్డారు. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో ఆదివారం రాష్ర్టస్థాయి మహిళా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తుండగా.. అంగన్‌వాడీ కార్యకర్తలు, అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనం రూ.15 వేలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. సహనం కోల్పోయిన సీఎం.. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. ‘క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వదిలిపెట్టేది లేదు. నేను అప్పీలు చేస్తున్నాను. మంచిదికాదు. పరిష్కారానికి ఇది సమయం కాదు.
సమస్య ఏదైనా ఉంటే చెప్పండి పరిష్కరిస్తాం. ప్లకార్డులు పట్టుకుని ఇలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అంటూ ఆవేశంగా మహిళల వైపు వేలు చూపిస్తూ తనదైన శైలిలో బాబు మాట్లాడారు. అంగన్‌వాడీలకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఆందోళన చేసినంత మాత్రాన ప్రభుత్వం విని మీ సమస్యలు పరిష్కారమవుతాయని భావించవద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో మహిళలు ఆగ్రహంతో ‘సమస్యలు గురించి అడిగితే మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ బాబుపై నిరసనగళాన్ని పెంచారు. ఈ సందర్భంలో సీఎం సూచనల మేరకు పోలీసులు మహిళలను అదుపు చేసేందుకు యత్నించారు.
అంగన్‌వాడీల ఆవేదన ఇదే..
జిల్లాలో 7,400 మంది అంగన్‌వాడీలు ఉన్నామని, 4 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారని నెల్లూరు అంగన్‌వాడీలు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలకోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తీవ్ర గందరగోళం..: సభలో అంగన్‌వాడీ మహిళలు లేచి మాట్లాడుతుంటే సభకు వచ్చిన మిగిలిన జనమంతా చంద్రబాబు ప్రసంగాన్ని పట్టించుకోకుండా.. మహిళలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో.. తెలుసుకునేందుకు అటువైపు వెళ్లడం కనిపించింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సీఎం అసహనంతో తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెనుదిరిగారు.
మహిళలకు తప్పని తిప్పలు
రాష్ట్రస్థాయి మహిళా సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు.. రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలను బస్సుల్లో తరలించారు. సభా ప్రాంగణంలో ఉక్కపోత.. కొన్నిచోట్ల తాగునీరు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక, సీఎం చంద్రబాబు.. సభావేదికకు 2.30 గంటలు ఆలస్యంగా రావడంతో మహిళలు ఉక్కపోతతో ఇబ్బందులుపడ్డారు. తమకు అరకొర భోజనం పెట్టారంటూ చిత్తూరుకు చెందిన రమణమ్మ, కర్నూలుకు చెందిన రాజేశ్వరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.