మానవ సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. తమతో కలిసి జీవించే మనుషులనే అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు.
విజయనగరం క్రైం: మానవ సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. తమతో కలిసి జీవించే మనుషులనే అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. హత్యలకు అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా రెండు, మూడు కారణాలను చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాల వల్లే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. నిందితులకు శిక్షలు పడుతున్నా సమాజాంలో అనుకున్నంత మార్పు రావడం లేదు. కారణాలేమైనప్పటికీ వరుస హత్యలతో జిల్లా వణుకుతోంది.
కొన్ని కేసులు
జూన్ 30న కొత్తవలస మండలం కేంద్రానికి చెందిన జి. పాపారావు అనే వ్యక్తి తన భార్య లక్ష్మీభవానీని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటనకు ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని స్థానికులు చెబుతున్నారు.
జూన్ 28న పట్టణంలోని అరుంధతీనగర్‌లో సెప్టిక్ ట్యాంకులో ఓ బాలుడు శవమై తేలాడు. తండ్రి అప్పలనాయుడు చంపేసి పడేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జూన్ 14న పట్టణంలోని ప్రసాద్‌నగర్‌లో కుటుంబ కలహాలతో భార్య లక్ష్మి (26)ని భర్త కృష్ణ కత్తితో పీకకోసి హత్యచేసి పరారయ్యూడు.
జూన్ నెలలో మెంటాడ మండలం పోరాం గ్రామంలో లెంక ఈశ్వరరావు అనే వ్యక్తి అత్త శీర కొండమ్మను కర్రతో మోది హత్యచేశాడు. అత్త కారణంగా భార్య దూరమైందని వేదనతో ఈ హత్య చేశాడు. ఇలాంటివెన్నో సంఘటనలో జిల్లాలో తరచూ జరుగుతున్నారుు. క్షణికావేశంలో హత్యలు చేసి చాలా మంది జైలులో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంఘటన వల్ల రెండు కుటుంబాలూ ఎంత నష్టపోయిందీ ప్రజలకు వివరిస్తే మిగిలిన వారైనా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
చిన్న చిన్న సమస్యలను కుటుంబ పెద్దలే పరిష్కరించాలి. ఎక్కువగా అక్రమ సంబంధాల వల్లే హత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి వ్యవహారాలు జరగకుండా కుటుంబ సభ్యులు దృష్టి సారించాలి.
- ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ