
వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాజావలీ
నెల్లూరు, సోమశిల: వారంతా స్నేహితులు. వారిలోని ఓ నిరుపేద యువకుడికి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. వైద్యానికి భారీగా నగదు వెచ్చించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. స్నేహితుడ్ని ఎలాగైనా కాపాడుకోవాలని మిగిలిన స్నేహితులు జోలె పట్టారు. ఇంటింటికి తిరిగి నగదు సాయం చేయాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్‌షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్ ఖాజావలీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చదువు మానేశాడు.
సెంట్రింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం హసీనాను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఖాజావలీ తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు స్పందించి సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు
తమతో పాటు తిరిగే స్నేహితుడు ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి బారిన పడడం స్నేహితులను కలచివేసింది. స్నేహితుడి ప్రాణాలను కాపాడుకునేందుకు స్నేహితులందరూ ఒక్కటై జోలె పట్టారు. రెండ్రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే దాతలు షేక్ జావీద్ 77994 47137, నియాజ్ 9676 517112 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment