రైళ్లకు వేసవి తాకిడి
హౌరా రైళ్లకు రిగ్రెట్.. ఏసీ కోచ్‌లకు తీవ్ర డిమాండ్
తిరుపతి, హైదరాబాద్, చెన్నైలకు చాంతాడంత జాబితా
{పత్యేక రైళ్లు, అదనపు కోచ్‌ల కోసం ఎదురు చూపు
విశాఖపట్నం సిటీ: రైళ్లపై వేసవి ప్రభావం పడింది.సెలవుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు బెర్తులు లభించడం గగనమైంది. అన్ని ముఖ్యమైన రైళ్లలోనూ మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. ఏసీ కోచ్‌లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. కొన్ని ప్రధాన రైళ్లకు థర్డ్ ఏసీలో జూన్‌నెలాఖరు వరకూ బెర్తు లభించని పరిస్థితి. విశాఖ నుంచి హౌరా (కోల్‌కతా) చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖ మీదుగా హౌరా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు బెర్తులు లభించే పరిస్థితి వచ్చే రెండు మాసాల్లో కనిపించడం లేదు. ఫలక్‌నామా (12704), ఈస్ట్‌కోస్ట్ (18646) ఎక్స్‌ప్రెస్‌ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ రైళ్లకు మే నెలాఖరు వరకు స్లీపర్, థర్డ్ ఏసీ క్లాసుల్లో రిగ్రెట్(నో రూం) చూపుతోంది. ఇక ఆ మార్గంలో నడిచే హౌరా మెయిల్(12840), కోరమాండల్ (12842), యశ్వంత్‌పూర్-హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ వంటి రెగ్యులర్ రైళ్లకు జూన్ తొలివారం వరకూ చాంతాడంత నిరీక్షణ జాబితాతో పాటు కొన్ని రోజుల్లో టికెట్ జారీ కాని పరిస్థితి(రిగ్రెట్) ఏర్పడింది. వారాంతపు రైళ్లకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. చెన్నై రైళ్లదీ అదే దారి. మెయిల్ (12839), కోరమాండల్(12841) ఎక్స్‌ప్రెస్‌లకు జూన్ తొలివారం వరకు భారీ నిరీక్షణ ఏర్పడింది.
బొకారో ఎక్స్‌ప్రెస్(13351), టాటా-అలెప్పీ (18189) రైళ్లకు వచ్చేనెల 28వ తేదీ వరకు బెర్తు లభించని పరిస్థితి ఏర్పడింది. వారాంతపు రైళ్లకూ డిమాండ్ ఏర్పడింది.తిరుపతి వెళ్లాలంటే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. దీనిలో జూన్ రెండో వారం వరకూ బెర్తులు నిండిపోయాయి. స్లీపర్ క్లాసుకు వందల సంఖ్యలో నిరీక్షణ జాబితా వుండగా, థర్డ్ ఏసీలో పదుల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు ఏర్పడింది. ఈ నెలాఖరుకు అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన వెంటనే జూన్ నెలంతా బెర్తులు నిండిపోవడం ఖాయం. ఇక దూర ప్రాంతం నుంచి వచ్చే పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) రైలుదీ అదే పరిస్థితి. ఈ రైలుకు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణజాబితా నెలకొన్నది. సికి్రందాబాద్ చుట్టుపక్కల రైళ్లకు యథావిధిగా వేసవి డిమాండ్ నెలకొంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015) రైళ్లకు డిమాండ్ నెలకొన్నది. ఈ రైళ్లకు మే నెలాఖరు వరకు ఖరారు బెర్తు లభించడం కష్టమే. ఇప్పటికే బెర్తులు నిండిపోగానే నెలలో నాలుగైదు రోజులు ఆర్‌ఏసీ చూపుతోంది. నేరుగా ఖరారు టిక్కెట్ లభించే పరిస్థితి లేదు,.
డిమాండ్ పెరిగే అవకాశాలు
ఈ నెలాఖరు నుంచి సుమారుగా అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో వారం రోజుల తర్వాత అన్ని రైళ్లకు డిమాండ్‌పెరిగే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఎంసెట్‌ప్రవేశ పరీక్షతర్వాత మరింత రద్దీగా మారుతాయనడంలో సందేహం లేదు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లకు తాకిడి నెలకొనడంతో ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి సారించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక రైల్వే అధికారులు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రధానంగా హౌరా, చెన్నై, సికింద్రాబాద్, వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారితోపాటు తిరుపతి, షిర్డీ వంటి తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలు తీరే విధంగా ప్రత్యేక రైళు నడపాలని కోరుతున్నారు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసినా కొంత ఊరట కలుగుతుందని భావిస్తున్నారు.