Berths
-
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
భారత రెజ్లింగ్ ట్రయల్స్ 25, 26వ తేదీల్లో
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే భారత జట్లను ఈనెల 25, 26వ తేదీల్లో ఎంపిక చేయనున్నారు. పాటియాలాలో నిర్వహించే ఈ ట్రయల్స్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ఈ ట్రయల్స్‌కు హాజరు కావాల్సిందేనని భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్–హక్ ప్యానెల్ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. సెపె్టంబర్ 16 నుంచి 24 వరకు బెల్గ్రేడ్లో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ప్రపంచ చాంపియన్íÙప్లో ఆయా కేటగిరీల్లో టాప్–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం
టోక్యో: కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఒలింపిక్స్ బెర్త్‌లపై ఆటగాళ్లలో నెలకొన్న సందేహాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులు స్పష్టత ఇచ్చారు. అర్హత టోర్నీల ద్వారా ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్‌లు సాధించిన 6,200 మంది అథ్లెట్ల స్థానానికి ఢోకా లేదని తెలిపారు. వారు వచ్చే ఏడాది జరుగనున్న ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఐఓసీ నిర్ణయంపై అన్ని అంతర్జాతీయ క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఇప్పటికే టోక్యోకు అర్హత సాధించిన అథ్లెట్లను నేరుగా వచ్చే ఏడాది గేమ్స్‌లో అనుమతించడం హర్షించదగిన అంశం. ఇంకా మిగిలి ఉన్న స్థానాల కోసం సరైన పద్ధతిని అనుసరించి అర్హత టోర్నీలు నిర్వహించాలి’ అని ఆయన అన్నారు. కరోనా కారణంగా ఆటలన్నీ రద్దు కాకముందే మారథాన్, స్విమ్మింగ్, ఇతర క్రీడా ఈవెంట్లలో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు జరుగగా వందలాది మంది అథ్లెట్లు టోక్యో బెర్త్‌లు కైవసం చేసుకున్నారు. అనూహ్యంగా విశ్వక్రీడలు వాయిదా పడటంతో వారి కోటాలపై ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు సగం బెర్త్‌లే ఖరారు కాగా... మిగిలిన స్థానాలను ఎలా భర్తీ చేస్తారనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. -
ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు శుభవార్త...
పారిస్ : యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగ్గజం ఎయిర్‌బస్ తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 నాటికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు కూడా పడుకోని ప్రయాణించడానికి వీలుగా క్యాబిన్లలో బెర్తులను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్‌లో ఎయిర్ ఫ్రాన్స్- కేఎల్ఎం ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కూడా స్లీపింగ్ బెర్త్స్ కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ వ్యయంతో రూపొందించే ఈ బెర్తులను కాబిన్ పై భాగంలో గాని, కింది భాగంలో గాని ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌బస్, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సఫ్రాన్‌కు అనుబంధ సంస్థ అయిన జోడాయిక్ ఎయిరోస్పేస్ కంపెనీతో కలిసి A330 కార్గో జెట్లలో లోయర్ డెక్ స్లీపింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే స్లీపర్ కంపార్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్ కంపార్టుమెంట్లలో సరిగ్గా సరిపోతాయని వెల్లడించింది. 2020 నాటికి A330 విమానాలకు సరిపోయే డిజైన్‌ను రూపొందించనున్నట్లు ఎయిర్‌బస్ తెలిపింది. ఈ ప్రయోగం ఫలిస్తే త్వరలోనే A330XWB ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు పరిచే అవకాశాలను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ బస్ కాబిన్ కార్గో ప్రోగ్రామ్‌ల ముఖ్య అధిపతి జెఫ్ పిన్నర్ మాట్లాడుతూ... ఈ మార్పు ప్రయాణికుల సౌకర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి నిదర్శనమని భావించవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని మిగతా ఎయిర్‌లైన్స్ వారు కూడా మెచ్చుకున్నారు. ఈ ప్రయోగానికి మంచి స్పందనే వస్తుందని అన్నారు. లోయర్ డెక్ పరిష్కారాలను చూపడంలో తమ సంస్ధకు మంచి నైపుణ్యం ఉందని జోడాయిక్ ఎయిరోస్పేస్ కాబిన్ డివిజన్ ముఖ్య అధికారి క్రిస్టోఫ్ బెర్నర్డిని కూడా చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే నేడు వేర్వేరు ఎయర్ లైన్స్ మధ్య భిన్నత్వాన్ని గుర్తించడానికి కీలక అంశంగా మారిందన్నారు. -
రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్ !
ప్రయాణాలపై సంక్రాంతి ప్రభావం టిక్కెట్లు అమ్మకాలు నిలిపేసిన ప్రైవేటు బస్ ఆపరేటర్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్‌లు తణుకు : సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా, యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది. వేలాది మందిపై ప్రభావం జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ముఖ్యమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందినవారు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబయి, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణంగా రెండు, మూడు రోజుల పాటు వరుస సెలవులు వస్తేనే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు రెండు వారాలపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని పలువరు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం మూడు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో కనీసం టిక్కెట్టు తీసుకునే స్థితి లేకుండా పోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఆర్టీసీదీ అదే తంతు ఆర్టీసీ అధికారులు పండగ రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపాలనే యోచనలో ఉన్నారు. కొందరు తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోగా మిగిలిన వారంతా పండగ తర్వాత ఆయా నగరాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధార పడక తప్పదు. ఈ పరిస్థితుల్లో జనవరి 20 వరకు ఖాళీల్లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే పండుగ తర్వాత రూ. వెయ్యి పైబడి చెబుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపినా టిక్కెట్టు ధర మాత్రం భారీగానే పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టిక్కెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రైలూ లేదు.. బస్సూ లేదు!
కానరాని ‘ప్రత్యేక’ ఏర్పాట్లు సమీపిస్తున్న దసరా, దీపావళి వందల్లో వెయిటింగ్ లిస్టు పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: పండుగల సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి, ఆ తరువాత సంక్రాంతి. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లన్నింటిలోనూ జనవరి వరకూ బెర్తులు నిండిపోయాయి. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు దసరా సెలవులు ముంచుకొస్తున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వేలో చలనం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏటా ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది దసరా ప్రయాణం భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం నెలా పదిహేను రోజుల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించవలసిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లలో మరో 2 నెలలైనా రద్దీ తగ్గే అవకాశం లేదు. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప జనం సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి. తీరా పండుగ సెలవులు వచ్చేశాక రైళ్లను ప్రకటించినా ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు... ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో జంట నగరాల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగలు, వరుస సెలవుల్లో ఈ సంఖ్య 3 లక్షల నుంచి 3.5 లక్షలు ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే సుమారు 2.5 లక్షల మంది బయలుదేరుతారు. కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కూడా రద్దీ అనూహ్యంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా అదనపు సదుపాయాలు కల్పించవలసిన అధికారులు ఆ దిశగా పెద్దగా కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా రైళ్లు లేకపోవడంతో జనం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. ఈ ఏడాది ఆర్టీసీ సైతం ఇప్పటి వరకు ప్రత్యేక బస్సులు ప్రకటించకపోవడం గమనార్హం. మరోవైపు ఏటా ప్రత్యేక రైళ్ల సంఖ్య తగ్గిపోతోంది. 2012లో దసరా సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను నడిపారు. 2013లో వాటిని 45కు పరిమితం చేశారు. గత సంవత్సరం 40 రైళ్లు నడిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పెషల్ రైళ్ల ఊసే లేదు. అదే బాటలో ఆర్టీసీ.... దసరా, దీపావళి వంటి పర్వదినాలకు 15 రోజులు ముందుగానే ప్రత్యేక బస్సులు ప్రకటించే ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తుగా ప్రకటించడం వల్ల దూరప్రాంతాలకు అడ్వాన్స్ రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు. అమలాపురం, కాకినాడ, విశాఖ, ఏలూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు గతేడాది వరకు ర ద్దీని బట్టి 3,500 నుంచి 4,000 బస్సులు అదనంగా నడిపేవారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజన అనంతరం బస్సుల నిర్వహణలో సమన్వయం లోపించింది. ఆ ప్రభావం ఇలాంటి సందర్భాల్లో కనిపిస్తోంది. ప్రత్యేక బస్సుల నిర్వహణ బాధ్యతను రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. -
రైళ్లకు వేసవి తాకిడి
హౌరా రైళ్లకు రిగ్రెట్.. ఏసీ కోచ్‌లకు తీవ్ర డిమాండ్ తిరుపతి, హైదరాబాద్, చెన్నైలకు చాంతాడంత జాబితా {పత్యేక రైళ్లు, అదనపు కోచ్‌ల కోసం ఎదురు చూపు విశాఖపట్నం సిటీ: రైళ్లపై వేసవి ప్రభావం పడింది.సెలవుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు బెర్తులు లభించడం గగనమైంది. అన్ని ముఖ్యమైన రైళ్లలోనూ మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. ఏసీ కోచ్‌లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. కొన్ని ప్రధాన రైళ్లకు థర్డ్ ఏసీలో జూన్‌నెలాఖరు వరకూ బెర్తు లభించని పరిస్థితి. విశాఖ నుంచి హౌరా (కోల్‌కతా) చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖ మీదుగా హౌరా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు బెర్తులు లభించే పరిస్థితి వచ్చే రెండు మాసాల్లో కనిపించడం లేదు. ఫలక్నామా (12704), ఈస్ట్‌కోస్ట్ (18646) ఎక్స్‌ప్రెస్‌ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ రైళ్లకు మే నెలాఖరు వరకు స్లీపర్, థర్డ్ ఏసీ క్లాసుల్లో రిగ్రెట్(నో రూం) చూపుతోంది. ఇక ఆ మార్గంలో నడిచే హౌరా మెయిల్(12840), కోరమాండల్ (12842), యశ్వంత్‌పూర్-హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ వంటి రెగ్యులర్ రైళ్లకు జూన్ తొలివారం వరకూ చాంతాడంత నిరీక్షణ జాబితాతో పాటు కొన్ని రోజుల్లో టికెట్ జారీ కాని పరిస్థితి(రిగ్రెట్) ఏర్పడింది. వారాంతపు రైళ్లకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. చెన్నై రైళ్లదీ అదే దారి. మెయిల్ (12839), కోరమాండల్(12841) ఎక్స్‌ప్రెస్‌లకు జూన్ తొలివారం వరకు భారీ నిరీక్షణ ఏర్పడింది. బొకారో ఎక్స్‌ప్రెస్(13351), టాటా-అలెప్పీ (18189) రైళ్లకు వచ్చేనెల 28వ తేదీ వరకు బెర్తు లభించని పరిస్థితి ఏర్పడింది. వారాంతపు రైళ్లకూ డిమాండ్ ఏర్పడింది.తిరుపతి వెళ్లాలంటే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. దీనిలో జూన్ రెండో వారం వరకూ బెర్తులు నిండిపోయాయి. స్లీపర్ క్లాసుకు వందల సంఖ్యలో నిరీక్షణ జాబితా వుండగా, థర్డ్ ఏసీలో పదుల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు ఏర్పడింది. ఈ నెలాఖరుకు అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన వెంటనే జూన్ నెలంతా బెర్తులు నిండిపోవడం ఖాయం. ఇక దూర ప్రాంతం నుంచి వచ్చే పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) రైలుదీ అదే పరిస్థితి. ఈ రైలుకు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణజాబితా నెలకొన్నది. సికి్రందాబాద్ చుట్టుపక్కల రైళ్లకు యథావిధిగా వేసవి డిమాండ్ నెలకొంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015) రైళ్లకు డిమాండ్ నెలకొన్నది. ఈ రైళ్లకు మే నెలాఖరు వరకు ఖరారు బెర్తు లభించడం కష్టమే. ఇప్పటికే బెర్తులు నిండిపోగానే నెలలో నాలుగైదు రోజులు ఆర్ఏసీ చూపుతోంది. నేరుగా ఖరారు టిక్కెట్ లభించే పరిస్థితి లేదు,. డిమాండ్ పెరిగే అవకాశాలు ఈ నెలాఖరు నుంచి సుమారుగా అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో వారం రోజుల తర్వాత అన్ని రైళ్లకు డిమాండ్పెరిగే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఎంసెట్ప్రవేశ పరీక్షతర్వాత మరింత రద్దీగా మారుతాయనడంలో సందేహం లేదు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లకు తాకిడి నెలకొనడంతో ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి సారించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక రైల్వే అధికారులు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రధానంగా హౌరా, చెన్నై, సికింద్రాబాద్, వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారితోపాటు తిరుపతి, షిర్డీ వంటి తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలు తీరే విధంగా ప్రత్యేక రైళు నడపాలని కోరుతున్నారు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసినా కొంత ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. -
సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకూ అదనపు బోగీలు, బెర్తులు, సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఔరంగాబాద్-తిరుపతి (07405) ప్రత్యేక రైలు జూలై 4, 11 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరునాడు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-ఔరంగాబాద్ (07406) ప్రత్యేక రైలు జూలై 5, 12 తేదీలలో సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. విజయవాడ-సికింద్రాబాద్ (07207) ప్రత్యేక రైలు జూలై 3, 10 తేదీలలో రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్-విజయవాడ (07208)ప్రత్యేక రైలు జూలై 4, 11 తేదీలలో రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం (02728) ఏసీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్ జూలై 4, 11 తేదీలలో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02727) ప్రత్యేక రైలు జూలై 5, 12 తేదీలలో రాత్రి 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02723) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ జూలై 6న ఉదయం 11.55కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి మధ్యాహ్నం 1.25కి నిజాముద్దీన్ చేరుతుంది. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-సికింద్రాబాద్ (02724) రైలు జూలై 7న రాత్రి 7.20కి నిజాముద్దీన్ నుంచి బయలుదేరుతుంది. అదనపు బోగీలు ఏర్పాటు చేసే రైళ్లు ఇవే.. సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో బై వీక్లీ, సికింద్రాబాద్-విశాఖ దురంతో, దర్భంగా-సికింద్రాబాద్ బై వీక్లీ, సికింద్రాబాద్-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి సెవెన్‌హిల్స్, తిరుపతి-కరీంనగర్ బై వీక్లీ, సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనూర్ బై వీక్లీ, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై పినాకిని, విజయవాడ-విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, కాకినాడ-భావ్‌నగర్ వీక్లీ, కాకినాడ-షిరిడీ ట్రైవీక్లీ, విజయవాడ-హుబ్లీ అమరావతి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సాయినగర్ షిరిడి ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబయి తపోవన్, ధర్మాబాద్-మన్మాడ్ మరఠ్వాడా ఎక్స్‌ప్రెస్.