రైలూ లేదు.. బస్సూ లేదు!
కానరాని ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
సమీపిస్తున్న దసరా, దీపావళి
వందల్లో వెయిటింగ్ లిస్టు
పట్టించుకోని అధికారులు
సిటీబ్యూరో: పండుగల సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి, ఆ తరువాత సంక్రాంతి. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లన్నింటిలోనూ జనవరి వరకూ బెర్తులు నిండిపోయాయి. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు దసరా సెలవులు ముంచుకొస్తున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వేలో చలనం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏటా ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది దసరా ప్రయాణం భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం నెలా పదిహేను రోజుల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించవలసిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లలో మరో 2 నెలలైనా రద్దీ తగ్గే అవకాశం లేదు. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప జనం సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి. తీరా పండుగ సెలవులు వచ్చేశాక రైళ్లను ప్రకటించినా ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు...
ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో జంట నగరాల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగలు, వరుస సెలవుల్లో ఈ సంఖ్య 3 లక్షల నుంచి 3.5 లక్షలు ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే సుమారు 2.5 లక్షల మంది బయలుదేరుతారు. కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌ల నుంచి కూడా రద్దీ అనూహ్యంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా అదనపు సదుపాయాలు కల్పించవలసిన అధికారులు ఆ దిశగా పెద్దగా కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా రైళ్లు లేకపోవడంతో జనం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. ఈ ఏడాది ఆర్టీసీ సైతం ఇప్పటి వరకు ప్రత్యేక బస్సులు ప్రకటించకపోవడం గమనార్హం. మరోవైపు ఏటా ప్రత్యేక రైళ్ల సంఖ్య తగ్గిపోతోంది. 2012లో దసరా సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను నడిపారు. 2013లో వాటిని 45కు పరిమితం చేశారు. గత సంవత్సరం 40 రైళ్లు నడిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పెషల్ రైళ్ల ఊసే లేదు.
అదే బాటలో ఆర్టీసీ....
దసరా, దీపావళి వంటి పర్వదినాలకు 15 రోజులు ముందుగానే ప్రత్యేక బస్సులు ప్రకటించే ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తుగా ప్రకటించడం వల్ల దూరప్రాంతాలకు అడ్వాన్స్ రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు. అమలాపురం, కాకినాడ, విశాఖ, ఏలూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు గతేడాది వరకు ర ద్దీని బట్టి 3,500 నుంచి 4,000 బస్సులు అదనంగా నడిపేవారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజన అనంతరం బస్సుల నిర్వహణలో సమన్వయం లోపించింది. ఆ ప్రభావం ఇలాంటి సందర్భాల్లో కనిపిస్తోంది. ప్రత్యేక బస్సుల నిర్వహణ బాధ్యతను రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.