నార్తురాజుపాళెం ఏపీజీబీ శాఖలో తనిఖీ చేస్తున్న అధికారి వై. సుబ్రహ్మణ్యం
కోవూరు/కొడవలూరు/విడవలూరు: జిల్లాలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నార్తురాజుపాళెం, వేగూరు, వావిళ్ల, అల్లూరు శాఖల్లో నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరుగుతోంది. నాలుగు శాఖల్లో దాదాపు రూ.3 కోట్ల మేర నిధుల స్వాహా జరిగినట్లు ప్రాంతీయ కార్యాలయానికి ఫిర్యాదులందాయి. నకిలీ పాసుపుస్తకాలు పెట్టి పంట రుణాల పేరిట అక్రమార్కులు ఆయా శాఖల్లో పనిచేసిన మేనేజర్లతో కలిసి నిధులు స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిరుపేదలను అడ్డుపెట్టుకుని వారి ఆధార్‌కార్డులు తదితరాలతో ముద్ర రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు శాఖల్లో జరిగిన నిధుల స్వాహాపై బ్యాంక్ కడప ప్రాంతీయ కార్యాలయం విచారణాధికారులతో తనిఖీ చేపట్టింది. విచారణాధికారులు రంగంలోకి దిగి బ్యాంక్‌ల్లో విచారణ జరుపుతున్నారు. బుధవారం నార్తురాజుపాళెం ఏపీజీబీలో విచారణ జరిపారు. బ్యాంక్ రికార్డులను పరిశీలించారు. రుణాల మంజూరు, అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై విచారణాధికారి సుబ్రహ్మణ్యంను అడుగగా తొలుత నార్తురాజుపాళెం శాఖలో విచారణ జరుపుతున్నామన్నారు. మిగతా శాఖలను పరిశీలించి, విచారణ పూర్తిగా జరిపిన అనంతరం ఏ మేరకు నిధుల స్వాహా జరిగిందో తెలుస్తుందన్నారు. విచారణ అనంతరం స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.
నకిలీ పత్రాలతో రుణాలు
అల్లూరు: నకిలీ పత్రాలతో రుణాలు పొందిన వైనం అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో బుధవారం వెలుగుచూసింది. అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతాదారుడైన ఇందుపూరుకు చెందిన కాలేషా క్రాప్ లోనుకు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.3 లక్షలు రుణం పొందాడు. ఇదే పత్రాలను నకలీవి సృష్టించి ఇతర బ్రాంచ్‌ల్లోనూ రుణాలు పొందించినట్లు గుర్తించి ఖాతాదారుడిపై చీటింగ్ కేసు పెట్టామని అల్లూరు ఆంధ్రప్రగతి బ్యాంక్ మేనేజర్ మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment