ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ)తో మరో మూడు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి, విలీనానంతర బ్యాంకును అమరావతికి తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరలింపు ఆలోచన ఔచిత్యాన్ని పరిశీలించడం అవసరం. దేశంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి వాటి సంఖ్యను 43 నుంచి 28కి కుదించాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే రాష్ట్రస్థాయి బ్యాంకుని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మొదటగా స్వాగతించాలి. దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల సిబ్బంది తమ బ్యాంకులను విలీనం చేసి రాష్ట్రానికి ఒక్క గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ‘వన్ స్టేట్ – వన్ ఆర్‌ఆర్‌బీ’ విధానానికి అనుగుణంగా ఈ ఆకాంక్షను మన్నించింది. ఇందులో భాగంగా నూతన ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి రాష్ట్ర స్థాయిలో ఒకే బ్యాంకుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఈ నాలుగు బ్యాంకుల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరులో, చైతన్య గ్రామీణ బ్యాంకు గుంటూరులో, ఉత్తరాంధ్రలోని గ్రామీణ బ్యాంకులు వరంగల్ ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి.
ఇప్పుడు ఏపీలోని 26 జిల్లాల్లోని గ్రామీణ బ్యాంకుల విలీనానంతర రాష్ట్రస్థాయి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలన్నది ప్రశ్న. ఈ విషయంలో సంప్రదాయాలు, మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా ఈ ప్రధాన కార్యాలయాన్ని కడపలో కాకుండా అమరావతికి తరలించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది వివాదాస్పద నిర్ణయం. సంప్రదాయం విషయానికొస్తే... గత నమూనా ఒకటి ఉంది. రాయలసీమ గ్రామీణ బ్యాంకుతో అనంత గ్రామీణ
బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకులు 2006లో విలీనమయ్యాయి. విలీనానంతర బ్యాంకుగా ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ను ఏర్పాటు చేసి... రాయలసీమ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది కాబట్టి దాని ప్రధాన కార్యాలయాన్నీ కడపలోనే ఏర్పాటు చేశారు. మార్గదర్శకాల ప్రాతిపదికన చూస్తే... తాజాగా 2024 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్‌ఆర్‌బీ సెక్షన్ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు: గ్రామీణ బ్యాంకులు ఏదైనా ఒక పెద్ద గ్రామీణ బ్యాంకులో విలీనమైనప్పుడు, ఆ పెద్ద గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుందో, అక్కడే విలీనం తర్వాత ఏర్పడే రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలి. సంప్రదాయమే కాకుండా, ఇలా చూసినా, ఏపీ రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోని ఏర్పాటు కావాలి.
వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఇప్పటికే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పోషించిన పాత్ర విస్మరించలేనిది. ఏపీజీబీ రైతులకు రుణాలు ఇచ్చింది. స్వయం సహాయక బృందాలకు అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ , మధ్యతరహా పరిశ్రమలు అక్కడక్కడైనా నిడదొక్కుకోవడానికి ఊపిరి పోసింది. ఏపీజీబీ ఇలా చేయగలగడానికి కారణం రాయలసీమ నేపథ్యం, అవసరాలే! ఏపీజీబీ స్పాన్సర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకుతో సహా మిగతా మూడు గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల ముఖ్య అధికారుల వ్యక్తిగత అజెండాలూ, ఆ బ్యాంకుల వ్యాపార ప్రయోజనాలూ ఏపీజీబీ విలీన బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న వాదన వెనక ఉన్నాయని బలంగా వినిపిస్తున్నది. ఇది సరైనది కాదు. ఇది ప్రజల అవసరాలు, దీర్ఘకాల దృష్టితో, బాధ్యతతో పాలకులు నిర్ణయించాల్సిన అంశం.
కడపలో ఇప్పుడున్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి స్థలమివ్వడం వల్ల
2015 లోనే చాలా మంచి సొంత ప్రధాన కార్యాలయం ఉంది. 50 సెంట్లలో, 47 వేల చదరపు అడుగులలో, ఒక సెల్లార్, నాలుగు అంతస్తులలో అధునాతనమైన కార్యాలయంగా ఇది ప్రారంభమైంది. కడపలో ఆకర్షణీయమైన ఆఫీస్ ప్రెమిసెస్‌లో కలెక్టరేట్ తర్వాత ఇదే అత్యుత్తమమైనది.
ఇక రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల వ్యాపార ఫలితాల విషయానికొస్తే, ఏపీజీబీ తర్వాతే ఏదైనా! రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో 43 శాతం వ్యాపారం ఏపీజీబీదే. నష్టాలు తట్టుకునే సామర్థ్యం, మూలధన అవసరాల్ని తీర్చే శక్తి ఏపీజీబీకే ఎక్కువ (25.65%). కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ లలో కస్టమర్లను బాగా ఆకర్షించే కాసా నిష్పత్తిలో ఏపీజీబీదే అగ్రస్థానం.
అన్ని బ్యాంకుల మొత్తం కస్టమర్ల కంటే ఎక్కువగా ఏపీజీబీకే (86.75 లక్షల మంది కస్టమర్లు) ఉన్నారు. బ్రాంచ్‌ల సంఖ్య ఏ ఇతర గ్రామీణ బ్యాంకుతో పోల్చుకున్నా కూడా రెట్టింపే. రాష్ట్రంలోని మిగతా గ్రామీణ బ్యాంకులకు లేని చెస్ట్ సదుపాయం ఆర్బీఐ అనుమతితో కడప ఏపీజీబీకి ఎప్పటినుంచో ఉంది. మిగతా గ్రామీణ బ్యాంకుల మొత్తం
రిజర్వుల కంటే ఏపీజీబీ రిజర్వులు 1400 కోట్లు ఎక్కువ.
విభజన హామీల అమలు విషయంలో ఇప్పటికే న్యాయం జరగలేదు. పైగా, ఇటీవలే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో భాగమైన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇప్పుడు అమరావతిలో బుద్ధిగా ఒదిగిపోయింది. తాజాగా, రాయలసీమ నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు అమరావతికి తరలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. వచ్చేవి రాకపోయ, విశాల రాయలసీమ నడిబొడ్డున ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించాలన్న కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉందని వస్తున్న సంకేతాలు అనుబంధాలకు అతీతంగా ఇక్కడి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇప్పటికే వామపక్ష సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పార్టీలకు అతీతంగా అనేకమంది రాజకీయ నాయకులూ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజానుకూలంగా, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరిస్తుందని ఆశిద్దాం!
-ఎ. రఘునాథరెడ్డి, వ్యాసకర్త సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment