apgb
-
ఏపీజీబీలో నిధుల గోల్మాల్
కోవూరు/కొడవలూరు/విడవలూరు: జిల్లాలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నార్తురాజుపాళెం, వేగూరు, వావిళ్ల, అల్లూరు శాఖల్లో నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరుగుతోంది. నాలుగు శాఖల్లో దాదాపు రూ.3 కోట్ల మేర నిధుల స్వాహా జరిగినట్లు ప్రాంతీయ కార్యాలయానికి ఫిర్యాదులందాయి. నకిలీ పాసుపుస్తకాలు పెట్టి పంట రుణాల పేరిట అక్రమార్కులు ఆయా శాఖల్లో పనిచేసిన మేనేజర్లతో కలిసి నిధులు స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిరుపేదలను అడ్డుపెట్టుకుని వారి ఆధార్‌కార్డులు తదితరాలతో ముద్ర రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు శాఖల్లో జరిగిన నిధుల స్వాహాపై బ్యాంక్ కడప ప్రాంతీయ కార్యాలయం విచారణాధికారులతో తనిఖీ చేపట్టింది. విచారణాధికారులు రంగంలోకి దిగి బ్యాంక్‌ల్లో విచారణ జరుపుతున్నారు. బుధవారం నార్తురాజుపాళెం ఏపీజీబీలో విచారణ జరిపారు. బ్యాంక్ రికార్డులను పరిశీలించారు. రుణాల మంజూరు, అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై విచారణాధికారి సుబ్రహ్మణ్యంను అడుగగా తొలుత నార్తురాజుపాళెం శాఖలో విచారణ జరుపుతున్నామన్నారు. మిగతా శాఖలను పరిశీలించి, విచారణ పూర్తిగా జరిపిన అనంతరం ఏ మేరకు నిధుల స్వాహా జరిగిందో తెలుస్తుందన్నారు. విచారణ అనంతరం స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. నకిలీ పత్రాలతో రుణాలు అల్లూరు: నకిలీ పత్రాలతో రుణాలు పొందిన వైనం అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో బుధవారం వెలుగుచూసింది. అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతాదారుడైన ఇందుపూరుకు చెందిన కాలేషా క్రాప్ లోనుకు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.3 లక్షలు రుణం పొందాడు. ఇదే పత్రాలను నకలీవి సృష్టించి ఇతర బ్రాంచ్‌ల్లోనూ రుణాలు పొందించినట్లు గుర్తించి ఖాతాదారుడిపై చీటింగ్ కేసు పెట్టామని అల్లూరు ఆంధ్రప్రగతి బ్యాంక్ మేనేజర్ మోహన్‌రెడ్డి తెలిపారు. -
నగదు కొరతపై రైతుల ఆగ్రహం
- ఏపీజీబీకి తాళం వేసి నిరసన – సర్దిచెప్పిన సీఐ శ్రీనివాసులు డోన్ టౌన్ : నగదు కొరతపై రైతులు, ఖాతాదారులు కన్నెర్ర చేశారు. ఎప్పుడొచ్చినా డబ్బుల్లేవు.. బ్యాంక్ సేవా కేంద్రాలకు వెళ్లాలంటూ బ్యాంకు అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. వారి తీరుకు నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ డోన్ ప్రధాన శాఖను సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు తాళం వేశారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐ జయశేఖర్‌గౌడ్ బ్యాంక్ వద్దకు చేరుకొని సీపీఐ నేతలు రంగనాయుడు, సుంకయ్యలతో చర్చించారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ కళ్యాణశాస్త్రీని పిలిపించి ఖాతాదారులకు డబ్బు చెల్లించలేకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌లో నగదు కొరత తీవ్రంగా ఉందని మేనేజర్ వారి దృష్టికి తెచ్చారు. కమిషన్ కోసం కక్కుర్తి... ప్రధాన బ్యాంక్ శాఖలో చెల్లింపులు నిలిపివేసి సేవా కేంద్రాలకు ఖాతాదారులను వెళ్లమనడం, కమిషన్లు దండుకునేందుకేనని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, పట్టణ అధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ ఆరోపించారు. బ్యాంక్ కరస్పాండెండ్ (బీసీ) కేంద్రాల్లో రూ.వెయ్యికి రూ.150 నుంచి రూ.200 కమిషన్ కింద ఏజెంట్లు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బ్యాంక్‌లో నగదు నిల్వలు లేకపోతే.. నోటీస్ బోర్డు అంటించి రైతులకు నచ్చజెప్పి పంపించాలని సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐ జయశేఖర్ గౌడ్ మేనేజర్‌కు సూచించడంతో వివాదం సద్దుమణిగింది. -
ఏపీజీబీలో ఈ పాస్ బుక్ సౌకర్యం
రీజినల్ మేనేజర్ శివయ్య నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు విస్తృ సేవలను అందించే క్రమంలో ఈ–పాస్ బుక్ మొబైల్ అప్లికేషన్ సౌకర్యాన్ని శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచినట్లు ఆ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య తెలిపారు. స్థానిక కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని ఆ బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో శుక్రవారం ఏపీజీబీ ఈ పాస్ బుక్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ సంపత్‌కుమారాచారి తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు జిల్లాలో ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 88 శాఖలను కలిగి ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి రూ.1458కోట్లు డిపాజిట్లుగా, రూ.1299 కోట్లు రుణాలుగా కలిగి ఉందని వెల్లడించారు. జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో ఏటీఎంలను కలిగి ఉందన్నారు. మరో మూడు ఏటీఎంలను పెంచలకోన, కోవూరు, కొండాపురంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కలిగి ఉందన్నారు. అలాగే మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సౌకర్యం (92669 21358)తో పాటు ఎస్ఎంఎస్ సేవలను ఖాతాదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ వి.మధుసూదన్‌రావు పాల్గొన్నారు. -
జన్‌ధన్ ఖాతాలు ఉపయోగించుకోవాలి
– ఇక నుంచి ఖాతాదారులకు ఈ–పాస్ బుక్కులు – ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఆర్ఎం జయసింహారెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కింద జీరో అకౌంట్‌తో ప్రారంభించిన ఖాతాలను ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్‌ధన్ ఖాతాలు ప్రారంభమైన తొలి మూడు నెలల్లోపు ఒకసారైనా కనీసం రూ.100తోనే లావాదేవీలు చేసుకోవాలన్నారు. లేదంటే ఏడాదిలోగా ఖాతాలు రద్దవుతాయన్నారు. రూ.లక్ష వరకు ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఏపీజీబీ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లోనూ శుక్రవారం నుంచి సేవింగ్స్, లోన్స్ ఖాతాలను ఈ–పాస్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఎంఎస్ఎస్ అలర్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, మొబైల్ బ్యాంకింగ్ లాంటి అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్‌లో 1.11 లక్షల మంది రైతులకు రూ.978 కోట్లు పంట రుణాలు అందించామని తెలిపారు. సమావేశంలో బ్యాంకు అధికారులు కామేశ్వరరావు, నాగరాజు, శంకరనారాయణ, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య కోవూరు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం కేంద్రాలను కోవూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ శాఖ రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య తెలిపారు. స్థానిక ఏపీజీబీ బ్యాంక్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే ఏడు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో మూడు ఏటీఎం కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వాటిలో కోవూరు, పెంచలకోన, కొండాపురం బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు మార్టిగేజ్ లేకుండా సరిపడా భూమి ఉంటే తమ శాఖ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే రాబోయే కాలంలో 25వేల మంది రైతులకు పంట రుణాలు మా శాఖ ఆధ్వర్యంలో ఇవ్వనున్నామన్నారు. కోవూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్.వరప్రసాద్ మాట్లాడుతూ తమ బ్రాంచి ఆధ్వర్యంలో ఎన్పీఏ కింద స్వయం సహాయ సంఘాల సభ్యులు దగ్గర నుంచి సుమారు రూ.కోటి వసూలు కావాల్సి ఉందన్నారు. ఆయన వెంట ఫీల్డ్ ఆఫీసర్ పి.అంజన్‌కుమార్, బ్రాంచి సిబ్బంది ఉన్నారు. -
ఏపీజీబీ ఉద్యోగుల ఆందోళన బాట
– 12 నుంచి రిలే నిరాహార దీక్షలు కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య తీరును నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు బుధవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని మంగళవారం విలేకర్లకు వివరించారు. సమాన పనికి సమాన వేతనం అన్న నినాదమే గ్రామీణ బ్యాంకుల వ్యవస్థకు పునాదిగా ఉన్నపుడు సిండికేట్ బ్యాంకు యాజమాన్యంలోని మూడు గ్రామీణ బ్యాంకుల్లో ప్రథమ గ్రామీణ, కర్ణాటక గ్రామీణ బ్యాంకులు ఇంక్రిమెంట్లను పునరుద్దరించగా ఏపీజీబీ ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 7న సామూహిక నిరహార దీక్షలు, 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. యాజమాన్యం తీరులో మార్పు రాకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.ర్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 61 మందిని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశామని, వీరంతా ఉదయం 9 గంటలకే సునయన ఆడిటోరియానికి చేరుకోవాలని సూచించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
నెల్లూరు(అర్బన్): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం బీవీ శివయ్య పేర్కొన్నారు. స్థానిక కనుపర్తిపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీజీబీ ఎంఏసీసీ సొసైటీ అంతర్ జిల్లా క్రికెట్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్ఎం కే రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆట విడుపునకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏసీసీ సొసైటీ అధ్యక్షుడు కే హనుమంతరావు, బ్యాంకు అధికారులు చంద్రమౌళిరెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
నెల్లూరు(బృందావనం): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంయుక్తంగా మనుమసిద్ధినగర్‌లో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా ప్రస్తుతం ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. దాదాపు 200 మొక్కలు నాటారు. మూలాపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు దువ్వూరు శరత్చంద్ర, పెనుబల్లి చంద్రారెడ్డి, నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్ఆచారి, రియాజ్, కోశాధికారి పెంచలరాజా, సభ్యులు సమద్, హరీష్‌సింగ్, మధు, కార్తీక్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నిలువునా ముంచారు..
* చంద్రబాబు అన్ని రుణాలు మాఫీ చేస్తామన్నందుకే ఓట్లేశాం * ఇపుడేమో సవాలక్ష కొర్రీలేస్తున్నారు * రూల్స్ పేరుతో బ్యాంకర్లు కూడా అన్యాయం చేస్తున్నారు * ఏపీజీబీ ఎదుట ధర్నాలో మండిపడిన రైతులు అనంతపురం అగ్రికల్చర్ : అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత రైతుల నెత్తిన రాళ్లేశాడని రైతులు మండిపడ్డారు. రుణాలు కట్టొద్దని ఆయన చెప్పినందునే కట్టలేదని, ఇపుడేమో మాఫీ కాలేదని వాపోయూరు. చంద్రబాబునాయుడు ఓ రకంగా మోసం చేస్తుంటే బ్యాంకర్లు మరోలా ఇబ్బందులకు గురిచేస్తూ రుణమాఫీ వర్తించకుండా చేస్తున్నారని పలువురు రైతులు సోమవారం స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాలకు చెందిన రైతులు స్థానిక ఏపీబీజీలో పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలన్నీ మాఫీ జాబితాలో ఉంటాయని ఆశించారు. బంగారు కుదువపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ జాబితాలో లేకపోగా బంగారు నగలు వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బంగారు నగలు పెట్టి తీసుకున్న రుణాలు పంట కింద కాకుండా మామూలుగా తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఎల్డీఎం లేదా మీ-సేవలో అడగండంటూ ఉచిత సలహా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరి రైతులకు సంబంధించిన రుణాలు రూ.50 వేలు లోపున్నా పూర్తిగా మాఫీ కాకపోవడంతో నిలదీశారు. అందులో తమ ప్రమేయం లేదంటూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం మాఫీ జరిగిందని అధికారులు జవాబిచ్చారు. బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నపుడు పట్టాదార్ పాస్‌పుస్తకం నకలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు పసలూరు ఆంజనేయులు, పొడరాళ్ల శ్రీనివాసులు, తోపుదుర్తి శాంతమ్మ, చియ్యేడు వెంకటరెడ్డి, కాటికానికాలువ రామానాయుడు తదితరులు ప్రభుత్వం చేసిన అన్యాయం, బ్యాంకర్లు వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. రుణాలు తీసుకున్నపుడు ఎలాంటి షరతులు లేకున్నా మాఫీకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అసలే కరువుతో కుదేలై అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇలాంటి పరిస్థితి కల్పించడం దారుణమన్నారు. -
త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
పర్చూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా త్వరలో ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్టూరుల్లో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు ఒంగోలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ పేర్కొన్నారు. పర్చూరు శాఖ తరఫున శనివారం డిపాజిట్ల సేకరణ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా బ్యాంకు సిబ్బంది ఖాతాదారులతో రోడ్‌షో చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒంగోలు రీజియన్ పరిధిలోని 60 శాఖల ద్వారా మార్చి 2013 నాటికి రూ. 1500 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. 2014 మార్చి నాటికి రూ. 1800 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ. 600 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 1200 కోట్ల రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. పర్చూరు శాఖ ద్వారా రూ. 8 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 23 కోట్ల రుణాలిచ్చినట్లు వివరించారు. త్వరలో ఏటీఎం సౌకర్యంతో పాటు రైతులకు కిసాన్ స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల్లో తొలిసారి ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకు తమదేనన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వసూలుకాని బకాయిల కోసం ఒన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని రుణగ్రహీతలకు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంపులు సెప్టెంబర్ 3న అద్దంకి, 4న కందుకూరు, 5న ఒంగోలుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాంపులను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే తిరిగి వెంటనే రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 5 కోట్ల విలువైన 1800 సోలార్ యూనిట్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. యూనిట్లకు 40 శాతం నాబార్డు రాయితీ, 10 శాతం లబ్ధిదారుని వాటా, 50 శాతం బ్యాంకు రుణం అందజేస్తుందన్నారు. ఆధార్ అనుసంధానం తో లభించే అన్ని పథకాలు తమ బ్యాంక్ ద్వారా పొందవచ్చని వివరించారు. సీనియర్ సిటిజన్స్‌కు తమ బ్యాంక్ ద్వారా 0.75 శాతం అదనపు వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జి.రాధాకృష్ణ, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు, స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాల్గొన్నారు.