నిలువునా ముంచారు..
* చంద్రబాబు అన్ని రుణాలు మాఫీ చేస్తామన్నందుకే ఓట్లేశాం
* ఇపుడేమో సవాలక్ష కొర్రీలేస్తున్నారు
* రూల్స్ పేరుతో బ్యాంకర్లు కూడా అన్యాయం చేస్తున్నారు
* ఏపీజీబీ ఎదుట ధర్నాలో మండిపడిన రైతులు
అనంతపురం అగ్రికల్చర్ : అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత రైతుల నెత్తిన రాళ్లేశాడని రైతులు మండిపడ్డారు. రుణాలు కట్టొద్దని ఆయన చెప్పినందునే కట్టలేదని, ఇపుడేమో మాఫీ కాలేదని వాపోయూరు. చంద్రబాబునాయుడు ఓ రకంగా మోసం చేస్తుంటే బ్యాంకర్లు మరోలా ఇబ్బందులకు గురిచేస్తూ రుణమాఫీ వర్తించకుండా చేస్తున్నారని పలువురు రైతులు సోమవారం స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట ఆందోళనకు దిగారు.
అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాలకు చెందిన రైతులు స్థానిక ఏపీబీజీలో పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలన్నీ మాఫీ జాబితాలో ఉంటాయని ఆశించారు. బంగారు కుదువపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ జాబితాలో లేకపోగా బంగారు నగలు వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు.
బంగారు నగలు పెట్టి తీసుకున్న రుణాలు పంట కింద కాకుండా మామూలుగా తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఎల్‌డీఎం లేదా మీ-సేవలో అడగండంటూ ఉచిత సలహా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరి రైతులకు సంబంధించిన రుణాలు రూ.50 వేలు లోపున్నా పూర్తిగా మాఫీ కాకపోవడంతో నిలదీశారు.
అందులో తమ ప్రమేయం లేదంటూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం మాఫీ జరిగిందని అధికారులు జవాబిచ్చారు. బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నపుడు పట్టాదార్ పాస్‌పుస్తకం నకలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు పసలూరు ఆంజనేయులు, పొడరాళ్ల శ్రీనివాసులు, తోపుదుర్తి శాంతమ్మ, చియ్యేడు వెంకటరెడ్డి, కాటికానికాలువ రామానాయుడు తదితరులు ప్రభుత్వం చేసిన అన్యాయం, బ్యాంకర్లు వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. రుణాలు తీసుకున్నపుడు ఎలాంటి షరతులు లేకున్నా మాఫీకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అసలే కరువుతో కుదేలై అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇలాంటి పరిస్థితి కల్పించడం దారుణమన్నారు.