త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
-
రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య
కోవూరు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం కేంద్రాలను కోవూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ శాఖ రీజినల్ మేనేజర్ వీబీ శివయ్య తెలిపారు. స్థానిక ఏపీజీబీ బ్యాంక్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే ఏడు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో మూడు ఏటీఎం కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వాటిలో కోవూరు, పెంచలకోన, కొండాపురం బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు మార్టిగేజ్ లేకుండా సరిపడా భూమి ఉంటే తమ శాఖ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే రాబోయే కాలంలో 25వేల మంది రైతులకు పంట రుణాలు మా శాఖ ఆధ్వర్యంలో ఇవ్వనున్నామన్నారు. కోవూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్.వరప్రసాద్ మాట్లాడుతూ తమ బ్రాంచి ఆధ్వర్యంలో ఎన్‌పీఏ కింద స్వయం సహాయ సంఘాల సభ్యులు దగ్గర నుంచి సుమారు రూ.కోటి వసూలు కావాల్సి ఉందన్నారు. ఆయన వెంట ఫీల్డ్ ఆఫీసర్ పి.అంజన్‌కుమార్, బ్రాంచి సిబ్బంది ఉన్నారు.