ఏపీజీబీలో ఈ పాస్ బుక్ సౌకర్యం
-
రీజినల్ మేనేజర్ శివయ్య
నెల్లూరు(బృందావనం):
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు విస్తృ సేవలను అందించే క్రమంలో ఈ–పాస్ బుక్ మొబైల్ అప్లికేషన్ సౌకర్యాన్ని శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచినట్లు ఆ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య తెలిపారు. స్థానిక కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని ఆ బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో శుక్రవారం ఏపీజీబీ ఈ పాస్ బుక్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ సంపత్‌కుమారాచారి తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు జిల్లాలో ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 88 శాఖలను కలిగి ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి రూ.1458కోట్లు డిపాజిట్లుగా, రూ.1299 కోట్లు రుణాలుగా కలిగి ఉందని వెల్లడించారు. జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో ఏటీఎంలను కలిగి ఉందన్నారు. మరో మూడు ఏటీఎంలను పెంచలకోన, కోవూరు, కొండాపురంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కలిగి ఉందన్నారు. అలాగే మిస్‌డ్ కాల్ బ్యాంకింగ్ సౌకర్యం (92669 21358)తో పాటు ఎస్‌ఎంఎస్ సేవలను ఖాతాదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ వి.మధుసూదన్‌రావు పాల్గొన్నారు.