పర్చూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా త్వరలో ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్టూరుల్లో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు ఒంగోలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ పేర్కొన్నారు. పర్చూరు శాఖ తరఫున శనివారం డిపాజిట్ల సేకరణ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా బ్యాంకు సిబ్బంది ఖాతాదారులతో రోడ్‌షో చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒంగోలు రీజియన్ పరిధిలోని 60 శాఖల ద్వారా మార్చి 2013 నాటికి రూ. 1500 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. 2014 మార్చి నాటికి రూ. 1800 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ. 600 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 1200 కోట్ల రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. పర్చూరు శాఖ ద్వారా రూ. 8 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 23 కోట్ల రుణాలిచ్చినట్లు వివరించారు. త్వరలో ఏటీఎం సౌకర్యంతో పాటు రైతులకు కిసాన్ స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల్లో తొలిసారి ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకు తమదేనన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
వసూలుకాని బకాయిల కోసం ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశాన్ని రుణగ్రహీతలకు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంపులు సెప్టెంబర్ 3న అద్దంకి, 4న కందుకూరు, 5న ఒంగోలుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాంపులను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే తిరిగి వెంటనే రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 5 కోట్ల విలువైన 1800 సోలార్ యూనిట్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. యూనిట్లకు 40 శాతం నాబార్డు రాయితీ, 10 శాతం లబ్ధిదారుని వాటా, 50 శాతం బ్యాంకు రుణం అందజేస్తుందన్నారు. ఆధార్ అనుసంధానం తో లభించే అన్ని పథకాలు తమ బ్యాంక్ ద్వారా పొందవచ్చని వివరించారు. సీనియర్ సిటిజన్స్‌కు తమ బ్యాంక్ ద్వారా 0.75 శాతం అదనపు వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జి.రాధాకృష్ణ, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు, స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాల్గొన్నారు.
త్వరలో ఏపీజీబీ ఏటీఎం కేంద్రాలు
Published Sun, Sep 1 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement