నగదు కొరతపై రైతుల ఆగ్రహం
- ఏపీజీబీకి తాళం వేసి నిరసన
– సర్దిచెప్పిన సీఐ శ్రీనివాసులు
డోన్ టౌన్ : నగదు కొరతపై రైతులు, ఖాతాదారులు కన్నెర్ర చేశారు. ఎప్పుడొచ్చినా డబ్బుల్లేవు.. బ్యాంక్ సేవా కేంద్రాలకు వెళ్లాలంటూ బ్యాంకు అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. వారి తీరుకు నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ డోన్ ప్రధాన శాఖను సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు తాళం వేశారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐ జయశేఖర్‌గౌడ్ బ్యాంక్ వద్దకు చేరుకొని సీపీఐ నేతలు రంగనాయుడు, సుంకయ్యలతో చర్చించారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ కళ్యాణశాస్త్రీని పిలిపించి ఖాతాదారులకు డబ్బు చెల్లించలేకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌లో నగదు కొరత తీవ్రంగా ఉందని మేనేజర్ వారి దృష్టికి తెచ్చారు.
కమిషన్ కోసం కక్కుర్తి...
ప్రధాన బ్యాంక్ శాఖలో చెల్లింపులు నిలిపివేసి సేవా కేంద్రాలకు ఖాతాదారులను వెళ్లమనడం, కమిషన్లు దండుకునేందుకేనని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, పట్టణ అధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ ఆరోపించారు. బ్యాంక్ కరస్పాండెండ్ (బీసీ) కేంద్రాల్లో రూ.వెయ్యికి రూ.150 నుంచి రూ.200 కమిషన్ కింద ఏజెంట్లు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బ్యాంక్‌లో నగదు నిల్వలు లేకపోతే.. నోటీస్ బోర్డు అంటించి రైతులకు నచ్చజెప్పి పంపించాలని సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐ జయశేఖర్ గౌడ్ మేనేజర్‌కు సూచించడంతో వివాదం సద్దుమణిగింది.