గాంధీహిల్‌కు మహర్దశ..! | Funds Release For Gandhi Hill Devolopment Krishna | Sakshi
Sakshi News home page

గాంధీహిల్‌కు మహర్దశ..!

Published Sat, Jul 7 2018 12:49 PM | Last Updated on Sat, Jul 7 2018 12:49 PM

Funds Release For Gandhi Hill Devolopment Krishna - Sakshi

భవానీ ద్వీపంలో ఏర్పాటు చేయనున్న వెలుగుల ఉద్యానవనం ఊహా చిత్రం

సాక్షి, విజయవాడ: విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గాంధీహిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) దృష్టి సారించింది. అథారిటీ పాలకమండలి చైర్మన్, పర్యాటక భాషా సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో గాంధీహిల్‌ను రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గాంధీహిల్‌ ఫౌండేషన్‌ ఆధీనంలో గాంధీ కొండ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ, గాంధీ హిల్‌ ఫౌండేషన్‌ పరస్పర అంగీకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఆధునిక నక్షత్రశాల, పిల్లల రైలు..
గాంధీహిల్‌పై నక్షత్రశాల, పిల్లల రైలు, లైబ్రరీలు ఇప్పటికే ఉన్నాయి. పిల్లల రైలు ఎక్కితే నగరాన్ని చూడవచ్చు. గాంధీహిల్‌ అభివృద్ధిలో భాగంగా   రూ.3.15 కోట్లతో  నక్షత్రశాలను మాత్రమే ఆధునికీకరించాలని తొలుత భావించినా, పాలక మండలి సమావేశం నిధుల సమస్య రాకుండా చూస్తామని, అన్ని విభాగాలను ఆధునికీకరించి పర్యాటక భరితంగా తీర్చిదిద్దాలని ఏపీటీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మీనా మాట్లాడుతూ అక్కడి పిల్లల రైలును తిరిగి నడపాలని, అదే క్రమంలో గ్రంథాలయ భవనానికి మెరుగులు దిద్ది ప్రతిఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. సర్వాంగ సుందరంగా కొండ ప్రాంతం ఉండాలని ల్యాండ్‌ స్కేపింగ్‌ మంచి ఆర్కిటెక్చర్‌కు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది.

చిరంజీవి పర్యాటక మంత్రిగా ఉండగానే..
యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా సినీనటుడు చిరంజీవి ఉన్నప్పుడు గాంధీ హిల్‌కు రూ.5 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లోనే నక్షత్రశాలను, పిల్లల రైలును ఆధునికీకరించాలని నిర్ణయించారు. అయితే ఈ నిధులను సద్విని యోగం చేసుకోలేదు. ఆ తరువాత కొద్దిపాటి నిధులతో గాంధీహిల్‌ను అభివృద్ధి చేశారు. అయితే అది పర్యాటకులను ఆకట్టుకునే స్థాయికి మాత్రం ఎదగ లేదు. ఈసారి ఏపీటీఏ రంగంలోకి దిగింది.

భవానీద్వీపంలో వెలుగుల ఉద్యానవనం..
మరోవైపు భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యాన వనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ పాలక మండలి నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా పది లక్షలకు పైగా ఎల్‌ఈడీలతో వెలుగుల ఉద్యానవనం తీర్చిదిద్దనున్నారు. ఈ వెలుగులు కష్ణానదిలో ప్రతిబించించే విధంగా ఏర్పాటు చేయనున్నారు.

సాధారణంగా మొక్కలతో జంతువులు, పక్షుల ఆకారాలను తీర్చిదిద్దటం మనం చూస్తుంటాం. ఈ వెలుగుల ఉద్యానవనంలో అవన్ని ఎల్‌ఈడీ వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో టూరిజం అథారిటీ సీఈఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యానవనం ప్రపంచ శ్రేణి పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉండనుందని, సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల సంబంధించి పలు అంశాలు పాలకమండలి అజెండాలో ఉండగా వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని మీనా నిర్ణయించారు. సమావేశంలో సంçస్థ పాలనా వ్యవహారాల సంచాలకుడు డాక్టర్‌ సాంబశివరాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement