రాష్ట్ర విభజన తరువాత దసరా ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కానీ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఏమాత్రం చేపట్టడం లేదు. ఆర్థిక భారమంతా దేవస్థానం పైనే వేస్తోంది. గత ఏడాది వరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన రూ.10 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలి. ఆ నిధులు మంజూరు చేయాలని పాలకమండలి గత ఏడాది ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాది దుర్గమ్మపైనే భారం మోపి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది నిర్వహించబోయే దసరా ఉత్సవాలకు నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.10 కోట్లు బకాయిలు వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు అంటున్నారు. నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని భక్తులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకు రూ.3 నుంచి రూ.4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ వ్యయం అంతా దేవస్థానమే భరిస్తోంది. రాష్ట్ర పండుగగా ప్రకటించినా ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయించడంలేదు. దీంతో తప్పనిపరిస్థితుల్లో దుర్గగుడి నిధులు ఖర్చు చేయాల్సి వస్తుంది. దసరా ఉత్సవాల్లో రెవెన్యూ, పోలీసు, కార్పొరేషన్, ఇరిగేషన్, మత్స్య, దేవాదాయ, తదితర శాఖలు పనిచేస్తాయి. ఏవిధమైన తొక్కిసలాటలు జరగకుండా పోలీసు శాఖ పర్యవేక్షిస్తే, శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా నగరపాలక సంస్థ చూస్తుంది. ఉత్సవాల పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ తలకెత్తుకుంటుంది. నది వద్ద ఏ విధమైన ప్రమాదాలు లేకుండా, తగినంత నీటి వసతి తదితర అంశాలను ఇరిగేషన్, మత్యశాఖలు చూసుకుంటాయి. ఆయా శాఖల నుంచి సిబ్బందిని పది రోజులు పాటు అమ్మవారి సన్నిధిలో పనిచేసినందుకు వారికి దేవస్థానం యూజర్‌చార్జీలు చెల్లిస్తుంది.
కనీసం రూ.1.5 కోట్లు ఇవ్వమని కోరిన ఈవో...
ఈ ఏడాది కనీసం రూ.3 నుంచి నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది. గత బకాయిలు మాట దేవుడెరుగు... ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే దసరా ఉత్సవాల ఖర్చంతా భరించకపోయినా కనీసం ఇతర శాఖలకు యూజర్ చార్జీలుగా చెల్లించే రూ.1.5 కోట్లయినా రాష్ట్ర ఖజానా నుంచి ఇప్పించాలని ప్రస్తుత ఈవో ఎం.పద్మ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయా శాఖల నుంచి ఉత్సవాలకు ఉచితంగా సేవలు అందించే లాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వం ఈ ఉత్సవాలకు నిధులు కేటాయించడం పై ఎంత మేరకు శ్రద్ధ తీసుకుంటుందనేది కనకదుర్గమ్మకే తెలియాలి.
ప్రజాప్రతినిధుల హడావుడి...
రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వ పెద్దలు పండుగ రోజుల్లో చేసే హడావుడి అంతా ఇంతాకాదు. సీఎం చంద్రబాబు నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు అందరూ దేవస్థానానికి వచ్చి పోతూ ఉంటారు. చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఆ పదిరోజులు దేవస్థానం అధికారులంతా నాయకుల సేవలోనే తరిస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా వార్ని పట్టించుకోవడం నామమాత్రమే. నిధులు ఇవ్వకుండా హంగామా చేయడాన్ని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ ఏడాది నుంచైనా ప్రభుత్వం దసరా ఉత్సవాలకు అయ్యే వ్యయమంతా భరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారి నిధులు తరిగి పోకుండా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment