'సమైక్య తీర్మానం చేయకపోతే భావి తరాలు క్షమించవు' | Future generation will not excuse us, says YS Vijayamma | Sakshi
Sakshi News home page

'సమైక్య తీర్మానం చేయకపోతే భావి తరాలు క్షమించవు'

Published Wed, Jan 8 2014 3:10 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'సమైక్య తీర్మానం చేయకపోతే భావి తరాలు క్షమించవు' - Sakshi

'సమైక్య తీర్మానం చేయకపోతే భావి తరాలు క్షమించవు'

  • సమైక్య తీర్మానం చేయకపోతే భావి తరాలు క్షమించవు: వైఎస్ విజయమ్మ
  •   బీహార్‌లో తీర్మానం లేకుండా బిల్లు వస్తే తిప్పి పంపారు..
  •   తీర్మానం చేశాకే బిల్లుపై అక్కడ చర్చ జరిగింది
  •   అధ్యయనానికి వెళ్లిన స్పీకర్ నాదెండ్లకు ఈ విషయం తెలియదా?
  •  
     సాక్షి, హైదరాబాద్: శాసన సభలో సమైక్య తీర్మానం చేయకపోతే భావితరాలు మనల్ని క్షమించవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తమ పార్టీ.. బిల్లుపై చర్చకు వ్యతిరేకం కాదని, అయితే అంతకుముందు సమైక్య తీర్మానం చేయాలని, అందుకోసం పట్టుపడతామని చెప్పారు. గతంలో బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్‌ను ఏర్పాటు చేసేటపుడు అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన బిల్లు వస్తే వెనక్కి తిప్పి పంపారని గుర్తు చేశారు.
     
    అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాతనే విభజన బిల్లుపై అక్కడ చర్చ జరిగిందన్నారు. విభజన ప్రక్రియ ఎలా జరిగిందో అధ్యయనం చేయడానికి బీహార్‌కు వెళ్లిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. తీర్మానం లేకుండానే బిల్లుపై చర్చిస్తే భవిష్యత్తులో ఏం సమాధానం చెబుతామని ఆమె ప్రశ్నించారు. బీఏసీ సమావేశంలో తాను ఇదే విషయం చెప్పినప్పుడు ఇతర పక్షాలు సరైన రీతిలో స్పందించలేదన్నారు. జస్టిస్ సర్కారియా, జస్టిస్ పూంఛ్‌కమిషన్లు రెం డూ కూడా ఆర్టికల్ 3 కింద విభజన చేయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలన్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏదైనా కమిటీ సిఫార్సు చేయడం గాని, సంబంధిత అసెంబ్లీ తీర్మానం గానీ ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రాతిపదిక ఏదీ లేకుండా విభజన బిల్లును నేరుగా పంపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
     
     తీసుకుంటే అందరూ మా పార్టీలోకే వస్తారు..
     
     కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల విషయాన్ని విలేకరులు విజయమ్మ దృష్టికి తీసుకురాగా ‘మేం సరేనంటే.. అందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకే వస్తారు’ అని సమాధానమిచ్చారు. ఇతర పార్టీల్లోని సీనియర్లు వైఎస్సార్ సీపీలోకి రావాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై అడగ్గా.. ‘సీనియర్లు వస్తారని చెప్పి ప్రారంభం నుంచీ మా పార్టీనే అంటిపెట్టుకున్న నాయకులను పక్కనపెట్టలేం కదా?’ అని అన్నారు. నాలుగేళ్లుగా తమ వెంట ఉండి, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని వదులుకోబోమని విజయమ్మ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement