కమిటీలు.. గడువులెందుకు?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి | Gadikota srikanth reddy slams andhra pradesh government | Sakshi
Sakshi News home page

కమిటీలు.. గడువులెందుకు?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Published Wed, Jun 18 2014 1:42 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

కమిటీలు.. గడువులెందుకు?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి - Sakshi

కమిటీలు.. గడువులెందుకు?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

* ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణాలు మాఫీ చేయాలి
* లేకపోతే ప్రజల తరపున వైఎస్సార్ సీపీ పోరాడుతుంది

 
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేయడానికి కమిటీలు ఎందుకు? 45 రోజుల గడువెందుకు? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలన్నింటినీ అణా పైసలతో సహా మాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు ఈ కసరత్తు అంతా ఎందుకని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజను ప్రారంభమవుతున్న తరుణంలో రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, మరోవైపు రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు కట్టకపోతే నగలను వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని అన్నారు.
 
 
 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే రుణాలను మాఫీ చేసి, రైతులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే తొలి సంతకంతో రైతులు చెల్లించాల్సిన 1,200 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల బకాయిలను పూర్తిగా రద్దు చేయడమే కాక, ఆ వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు రుణాల మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా మంచి పనులు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మద్దతునిస్తుందని, కానీ మోసపూరితమైన హామీలిచ్చి నెరవేర్చకపోతే ప్రజల తరపున గట్టిగా పోరాడుతుందని శ్రీకాంత్ హెచ్చరించారు.
 
 గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షమైన కాంగ్రెస్‌తో కలిసిపోయిన విధంగా తాము వ్యవహరించబోమని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రజల తరపున అన్ని విధాలా పోరాటం చేస్తామని చెప్పారు. ఏ అంశాన్నీ పరిష్కరించకుండా రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడదీశారని, అందుకు చంద్రబాబు ఇచ్చిన లేఖే కారణమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement