= గజగజ వణికిపోతున్న అటవీ సమీప గ్రామాలు
= ఎనిమిది నెలల్లో 30 మంది బలి
= ఆహారం కోసం గ్రామాలపై పడుతున్న వైనం
సాక్షి, బెంగళూరు : ప్రకృతిలో అన్ని సహజసిద్ధంగా ఉన్నప్పుడే పర్యావరణ సమత్యులత సాధ్యం. సహజత్వానికి భిన్నంగా ఉన్నప్పుడు ప్రకృతికి ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఇటీవల రాష్ర్టంలో ఎనిమిది నెలల కాలంలో 30 మంది అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మైసూరు అటవీ రీజియన్ పరిధిలో ఇటీవల ఆహారం కోసం వచ్చిన ఓ పులి నలుగురి చంపేసిన విషయం తెల్సిందే.
క్రూరమృగాల దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 300 పశువులు కూడా మృత్యువాత పడ్డాయని అటవీశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 అటవీ రీజియన్లు ఉండగా 11 రీజియన్లలో నిత్యం వ్యన్యప్రాణులు-మానవ సంఘర్షణ జరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు అటవీ రీజియన్ పరిధిలోకి వచ్చే రామనగర, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, బన్నేరుగట్ట నేషనల్ పార్క్, కోలార్, చిక్కబళాపుర అటవీ డివిజన్లలో వన్యప్రాణుల వల్ల ఎక్కువ ప్రాణనష్టం సంభవిస్తోంది. రాష్ట్రం మొత్తంపై 30 మరణాలు సంభవిస్తే ఒక్క బెంగళూరు రీజియన్‌లోనే వాటి సంఖ్య 10కి చేరింది. ఆ తర్వాతి స్థానంలో మడికెరి, చామరాజన గర, మైసూరు అటవీ రీజియన్లు ఉన్నాయి. ఇక మైసూరు రీజియన్‌లో వన్యమృగాల వల్ల
పశునష్టం ఎక్కువగా జరుగుతోంది. ఈ రీజియన్‌లో భాగమైన బండీపుర టైగర్ ప్రాజెక్ట్ డివిజన్, హన్సూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చూరీ సరిహద్దు గ్రామాలపై వన్యప్రాణులు ఎక్కువగా దాడులు చేస్తూ పశు నష్టం కలిగిస్తున్నాయి. గత ఎనిమిదిని నెలలల్లో ఈ ఒక్క రీజియన్‌లోనే 119 పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
ఎక్కువగా ఏనుగుల దాడుల్లోనే...
ఏనుగుల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లలో వన్యప్రాణుల దాడుల్లో మొత్తం 102 మంది చనిపోగా ఇందులో ఏనుగుల దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 75గా ఉంది. ఈ విషయమై ప్రముఖ పర్యావరణ వేత్త కృపాకర్ మాట్లాడుతూ... ‘ఆఫ్రికతో పోలిస్తే భారత్‌లో అటవీ ప్రాంతం చాలా తక్కువ. ఉదాహరణకు టాంజానియా అటవీ ప్రాంతంలోని ఏనుగుల సంఖ్య నీలగిరి అటవీ ప్రాంతంలోని ఏనుగుల సంఖ్య సమానంగా ఉంది. అయితే టాంజానియాలో ఎలిఫెంట్ టెరిటరీ 40 వేల చదరపు కిలోమీటర్లు ఉండగా నీలగిరిలో ప్రాంతం 5,553 చదరపు కిలోమీటర్లు మాత్రమే. దీంతో ఇక్కడి ఏనుగులు తరుచుగా గ్రామాలపై దాడులు చేస్తూ ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు.
తాజాగా అడవి దున్నలు, కృష్ణ జింకలు...
ఇప్పటివరకూ ఏనుగులు, పులులు, చిరుతలు ఎలుగుబంట్లు గ్రామాలపై దాడులు చేసి ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగిస్తుండగా ఇప్పుడు వాటి సరసన అడవిదున్నలు, కృష్ణ జింకలు వచ్చి చేరాయి. నాగరహోళి, బండీపుర, భద్రా, అణశి, దాండేలి, కాడంచిన సమీప గ్రామాల ప్రజలు అడవి దున్నల బారిన పడి పదుల సంఖ్యలో తీవ్ర గాయాపాలైన సంఘటనలు ఉన్నాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణ జింకల వల్ల ప్రాణ నష్టం లేకపోయిన తీవ్ర పంట నష్టం చోటుచేసుకుంటోంది. కొప్పల, హావేరి, తుమకూరు, గదగ, ఉత్తర కన్నడ జిల్లాల్లో గత ఎనిమిదినెలల్లో దాదాపు రూ. కోటి మేర విలువైన పంటలను నాశనం చేసినట్లు అటవీశాఖ ప్రాథమిక నివేదికలో తెలిపింది. రామనగర, బళ్లారి, తుమకూరు, చిక్కమగళూరు, బెల్గాం జిల్లాల్లో పులి, చిరుత, ఎలుగుబంట్ల వల్ల ప్రాణహాని సంభవిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
హడలెత్తిస్తున్న వ న్య మృగాలు
Published Mon, Dec 9 2013 3:20 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement
Advertisement