కాంగ్రెస్‌కు మంత్రి గల్లా వెన్నుపోటు
Published Sun, Jan 19 2014 1:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :తన కుమారుడికి టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా గెలిపించేందుకు రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూడటం బాధాకరమని పలువురు కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు అనుభవించిన మంత్రి గల్లా అరుణ కుమారి గుంటూరులో ఎన్నారై వైద్యులతో సమావేశం నిర్వహించి తన కుమారుడు జయదేవ్‌ను రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా బలపర్చమని కోరటం చాలా విచారకరమన్నారు. క్యాబినెట్‌లో కొనసాగుతున్న ఆమె శనివారం జీజీహెచ్‌లో జరిగిన సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డితో చాలా సన్నిహితంగా ఉండటం బాధాకారమని వాపోయారు.
ఒక పార్టీలో కొనసాగుతూ మరో పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వటం పార్టీని వెన్నుపోటు పొడవటంతో సమానమని పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్‌పార్టీని బలహీన పర్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి బయటకు వెళ్లి, కొడుకు కోసం టీడీపీ సభ్యత్వం తీసుకొని ప్రచారం చేసుకోవాలని ఆమెకు సూచించారు. జిల్లాలో పార్టీని బలహీన పర్చేవిధంగా మంత్రి గల్లా ప్రవర్తించడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు స్థిరంగానే ఉన్నారని, నాయకులే పదవుల కోసం, డబ్బుకోసం ఇతర పార్టీలకు వెళ్తున్నారని వాపోయారు. నాయకులు హుందాగా ప్రవర్తించాలని, వివాదాస్పద ప్రకటనలు చేయటం సరికాదని హితవుపలికారు.
డీసీసీ అధికార ప్రతినిధి జెల్థి రాజమోహన్ మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లు మంత్రి గల్లా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజులు గుంటూరులో ఉండి టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి, తన కుమారుడికి టీడీపీ సీటు ఇప్పించే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఆమె వల్ల కాంగ్రెస్‌పార్టీకి చెడ్డపేరు వస్తోందని, తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ లీగల్‌సెల్ చైర్మన్ జి.రవికుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మొగిలి శివకుమార్, కోనేటి గోవిందరావు, షేక్ బాజి, ఫరీద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement