
దోస్తీ కట్టిన గురుశిష్యులు
- ఉత్సవాల వేదికగా ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు
- 30 నిమిషాలు ముచ్చట్లు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మంత్రి గల్లా అరుణకుమారి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు బుధవారం నాటి ఘటనలు బలం చేకూర్చాయి. అదే సమయంలో ఒకనాటి గురుశిష్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్‌సీవీ నాయుడు ఒకే వేదికపై కనిపించడం మరో విశేషం. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రథమ శిష్యుడి గా ఎస్‌సీవీనాయుడు పేరుపొందారు.
అయితే ఎస్‌సీవీ నాయయుడు 2004లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరి తన రాజకీయ గురువైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై పోటీకి దిగారు. విజయమూ అందుకున్నారు. మరోసారి 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్‌సీవీ తలపడ్డారు. ఈ సారి విజయం బొజ్జల వైపు నిలచింది. అయితే కొంతకాలంగా ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
ఉత్సవాల వేదికగా ఒక్కటైన నేతలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ నుంచి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి (కాంగ్రెస్) ఒకే వేదికపై పలకరించుకుంటూ ప్రత్యేకతను చాటారు. అంతేకాదు శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న పొగడచెట్టు కింద కూర్చుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంత్రితో స హా ఈ నేతలంతా చెట్టు కింద కూర్చుని 30 నిమిషాలు ముచ్చటలాడారు.
కాంగ్రె స్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి, సీనియర్ నాయకులు శాంతారాం జె పవార్, చెలికం కృష్ణారెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వయ్యాల సుధాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తది తర నేతలు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చెంచయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శి జగన్నాథం నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు గురవయ్యనాయుడు, పాపిరెడ్డి, మునిరాజనాయుడు, పార్థసారథి తదితరులు సందడి చేశారు. గల్లా అరుణకుమారి, ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరడం ఇక లాంఛనమేనని ద్వితీయశ్రేణి నాయకులు చర్చించుకోవడం కనిపించింది.
ఇప్పుడే చెప్పలేను
తన రాజకీయ కార్యాచరణను భవిష్యత్తులో ప్రకటిస్తానని, టీడీపీలోకి చేరే విషయం ఇప్పుడే ప్రకటించలేనని మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు.