గల్లా గూండాల ఫ్యాక్టరీని మూసేయాలి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బ్యాటరీల తయారీ మానేసి గూండాలను తయారు చేస్తున్న గల్లా అరుణకుమారి అమరరాజ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని శెట్టిపల్లె పంచాయతీ వైఎస్‌ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీ, బీటీఆర్ కాలనీ, మంగళం క్వార్టర్స్ ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరులు చెవిరెడ్డి హనుమంతరెడ్డి, చెవిరెడ్డి రఘు, పార్టీ నాయకులు రుద్రగోపి, లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రుద్రగోపి, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారంలో ఉండి వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీశాఖ భూములను గల్లా అరుణకుమారి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవడం కోసం పార్టీ మారారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభంజనాన్ని తగ్గించి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో పార్టీ నాయకులు, కార్యకర్తలపై మంగళంలోని టీడీపీ నాయకులు, అమరరాజ ఉద్యోగులతో దాడులు చేయిస్తోందన్నారు.
చంద్రగిరి ని యోజకవర్గంలో భాస్కర్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలుకుతుండడాన్ని చూసి ఓర్వలేక ఫ్యాక్టరీ ఉద్యోగులను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన పంచాయతీ మాజీ సర్పంచ్ మునికృష్ణ, వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడి గెలవాలని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు వి.గోపి, గాజుల రమణ, జయప్రకాష్, మహ్మద్‌కాశీం, ఓబుల్‌రెడ్డి, దాము, రమేష్, బ్రహ్మయ్య, శకుంతలమ్మ పాల్గొన్నారు.