రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్యపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్యపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రంగంలో ఉండేది ఒకరా, ఇద్దరా? లేదంటే ఏకంగా ముగ్గురా? వీరిలో తుది దాకా బరిలో మిగిలేదెవరు? వారికి మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయుణ రాజు (చైతన్య రాజు) పెద్దల సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాజ్యసభకు గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి, తాను పోటీ చేయాలనుకుంటున్నామని.... తమలో ఇద్దరమైనా కచ్చితంగా బరిలో ఉంటామని చైతన్యరాజు స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ అవసరం లేదని... ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులకు ఓటేసేందుకు ...పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలెవరూ సిద్ధంగా లేరన్నారు.
కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినా అయిదేళ్లు ఎమ్మెల్సీగా పార్టీకి సేవ చేశానని చైతన్యరాజు అన్నారు. కేవీపీ రామచంద్రావుకు కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ టికెట్ వస్తే సంతోషిస్తామన్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఆదివారం మధ్యాహ్నం సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు....సుమారు 60మంది వరకూ సమావేశం అవుతామని చైతన్యరాజు తెలిపారు.
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలతో తన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు కూడా తీసుకున్నారు. చైతన్య రాజు కూడా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేల సమీకరణకు కూడా దిగారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి అయిదుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. టి.సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్యు, కేవీపీ రావుచంద్రరావు, రత్నాబాయి, ఎంఏ ఖాన్ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సాంకేతికంగా 146 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ లెక్కన ఈసారి మూడు రాజ్యసభ స్థానాలు కచ్చితంగా రావచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా.
అయితే రాష్ట్ర విభజన నిర్ణయుం కారణంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య యుథాతథంగా ఉన్నా, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఈ నేపథ్యంలో అనుకుంటున్నట్టు మూడు స్థానాలైనా వస్తాయా, లేదా అన్న ఆందోళన నెలకొంది. విభజన నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగాలని భావిస్తుండటం పార్టీకి మరో తలనొప్పిగా మారింది.