జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ద్విచక్రవాహనానికి మినరల్ వాటర్ క్యాన్ కట్టుకుని వచ్చి బాధితులకు, వృద్ధులకు తాగునీటి సేవలు అందిస్తున్న జొన్నలగడ్డ రాజమోహన్
మానవసేవే మాధవసేవ అని అందరూ సూక్తులు చెబుతుంటారు తప్ప ఆచరణలో ఎవరూ పాటించరు. కోట్లకు పడగలెత్తిన వారు సైతం గుళ్లో ఉన్న మాధవుడికి మొక్కుతారు తప్ప...గుడి బయట ఉన్న మానవుడిని పట్టించుకోరు. సేవ చేయాలనే మనసు ఉండాలే కానీ...లక్షలు, కోట్లు ఉండనవసరం లేదని, ఉన్నంతలోనే సేవ చేయవచ్చని గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ అనే యువకుడు నిరూపిస్తున్నాడు.
లక్ష్మీపురం(గుంటూరు): ఆ యువకుడు వ్యాపార వేత్తో, ఉన్నతోద్యోగో కాదు... గ్యాస్ కంపెనీలో పని చేసే సాధారణ కూలీ. డబ్బుకు పేద అయినా...సేవలో రాజు..అతని పేరు జొన్నలగడ్డ రాజమోహన్. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏ పూటకు ఆ పూట పనిచేసి కుటుంబాన్ని పోషించే వారు. ఒక్కో సందర్భంలో కుటుంబమంతా పస్తులున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అందుకే ఉన్నంతలో...తను చేయగలినంతలో అన్నార్తులకు, దాహార్తులకు సేవ చేస్తున్నాడు. నగరంలోని హనుమయ్య నగర్‌కు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ హెచ్.పి గ్యాస్ కంపెనీలో నెలకు కేవలం 7వేల రూపాయల వేతనంపై పనిచేసే కూలీ. నెల జీతం అంతా కుటుంబ పోషణకు వినియోగిస్తాడు.
భార్య సుజాత టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. రాజమోహన్ ఖాళీ సమయంలో గ్యాస్ స్టౌవ్ రిపేర్లు చేస్తుంటాడు. ఈ అదనపు పనితో వచ్చి డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు. సహృదయ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వారానికి సుమారు 40 మందికి అన్నదానం చేస్తుంటాడు. తల్లి దండ్రులు లేని అనాథ విద్యార్థులను చదవించడం, వారికి పుస్తకాలు, బ్యాగ్‌లు, దుస్తులు ఇవ్వడంతో పాటు వారికి కావల్సిన అవసరాలు తీరుస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ద్విచక్రవాహనానికి మినరల్ వాటర్ క్యాన్‌ను కట్టుకొని సంచార చలివేంద్రం నడుపుతూ ఉచితంగా మంచినీరు అందిస్తాడు. ప్రతి సోమవారం జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు అందిస్తాడు. రోజూ ఎవరికో ఒకరికి సేవ చేస్తేనే తనకు తృప్తిగా ఉంటుందంటాడు రాజమోహన్.
Comments
Please login to add a commentAdd a comment