గుదిబండ
Published Wed, Dec 4 2013 3:08 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM
సాక్షి, కాకినాడ :సిలిండర్ ధరను చమురు సంస్థలు ఈ నెల ఒకటి నుంచి ఏకంగా రూ.66.50 పెంచేశాయి. దీంతో గత నెలలో రూ.1017 ఉన్న సిలిండర్ ధర నేడు ఏకంగా రూ.1083.50కి చేరింది. దీనికి రవాణా ఖర్చులు కలిపితే సిలిండర్ ఇంటికి చేరేసరికి రూ.1120 వరకూ సమర్పించుకోవలసిందే. పెరిగిన మొత్తానికి అనుగుణంగా సబ్సిడీ మొత్తం పెరగకపోవడం.. అంతకుముందు ఉన్న సబ్సిడీ కూడా ఖాతాల్లో సక్రమంగా జమ కాకపోవడంతో వినియోగాదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గందరగోళంగా డీబీటీ
ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) ప్రారంభమైనప్పటి నుంచి మధ్యలో ఒకటి రెండు నెలలు తప్ప ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. డీబీటీ అమలు ప్రారంభంలో రూ.854.50 ఉన్న సిలిండర్ మార్కెట్ ధర నేడు ఏకంగా రూ.1083కు పెరిగింది. మధ్యలో ఒకసారి తగ్గినప్పటికీ గత ఐదు నెలల్లో సుమారు రూ.230 పెరిగింది. ఆ మేరకు సబ్సిడీ మొత్తం జమ అయితే సమస్య ఉండేది కాదు. కానీ అలా జరగక, వినియోగదారులకు ప్రతి నెలా ఎంతోకొంత చేతి చమురు వదిలిపోతోంది. దీనికితోడు రవాణా ఖర్చులన్నీ కలిపి సిలిండర్‌పై కనీసం రూ.100 పైగా అదనంగా పడుతోంది. గత జూన్ ఒకటి నుంచి జిల్లాలో గ్యాస్‌కు అమలు చేస్తున్న డీబీటీ గందరగోళంగా తయారైంది. ‘సబ్సిడీ మొత్తం అడ్వాన్స్‌గా మీ ఖాతాల్లో జమవుతుంది. ఆ మొత్తానికి ప్రస్తుతం మీరు చెల్లించే మొత్తం రూ.412 జత చేసుకొని సిలిండర్ విడిపించుకోవచ్చు. ఎలాంటి భారమూ ఉండదు’ అంటూ అధికారులు కబుర్లు చెప్పారు.
డీబీటీ అమలుకు ముందు సిలిండర్ ధర రూ.411గా ఉండేది. రవాణా ఖర్చులు కలుపుకొని రూ.420కి ఇంటికి చేరేది. మొదట్లో బుక్ చేసుకున్న 24 గంటల్లో అకౌంట్ సీడింగ్ పూర్తయిన వినియోగదారుల ఖాతాలో అడ్వాన్స్ సబ్సిడీగా రూ.435 జమ అయ్యేది. ఆసమయంలో సిలిండర్ ధర రూ.854.50గా ఉండేది. అంటే ప్రారంభంలోనే వినియోగదారునిపై సిలిండర్‌పై రూ.8.50 భారం పడేది.
సెప్టెంబర్‌లో సిలిండర్ ధర రూ.998. అడ్వాన్స్ సబ్సిడీ రూ.587 జమ కావాలి. కానీ రూ.534.49 మాత్రమే జమ అయ్యేది. దీనివల్ల రవాణా ఖర్చులు కాకుండా వినియోగదారుడిపై రూ.52.51 భారం పడేది. అక్టోబర్‌లో సిలిండర్ ధర కాస్తా రూ.1070కి చేరింది. ఈ లెక్కన సబ్సిడీ మొత్తం రూ.659 జమ కావాలి. కానీ రూ.603 మాత్రమే జమవుతుంది. అంటే ఈ నెలలో వినియోగదారుడు మోసే భారం రూ.56కు పెరిగింది.
అక్టోబర్ నుంచి సబ్సిడీ మొత్తం బుక్ చేసుకున్న తర్వాత కాకుండా సిలిండర్ విడిపించుకున్న తర్వాత జమ అవడం ప్రారంభమైంది. దీంతో బుక్ చేసుకున్న తర్వాత ఆ నెల మార్కెట్ రేటు ఎంత ఉంటే అంత మొత్తాన్ని ముందుగా చెల్లించి సిలిండర్‌ను విడిపించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ధర రూ.54 మేర తగ్గించారు. దీంతో సిలిండర్ రేటు రూ.1017కు చేరింది. ఆ మేరకు సబ్సిడీ సొమ్ము రూ.606 జమ కావాలి. కానీ కేవలం రూ.551 మాత్రమే జమ అయ్యేది. దీనివల్ల వినియోగదారులపై రూ.45 మేర భారం పడింది. ప్రస్తుతం సిలిండర్ ధర కాస్తా రూ.1083.50కు పెరిగింది.
దీంతో వినియోగదారులపై అదనంగా రూ.70 భారం పడనుంది. ఇది కూడా సబ్సిడీ మొత్తం జమ అయితేనే. లేకుంటే తడిసి మోపెడైనట్టే. నెలకు ఎంత తక్కువ లెక్క వేసినా జిల్లాలో ఐదు లక్షలకు పైగా సిలిండర్లు విడిపించుకుంటారు. ఆ మేరకు రూ.3.50 కోట్లకు పైగా భారం పడనుంది. జిల్లాలో మొత్తం 9,16,998 వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 8,35,149 కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ పూర్తయింది. 7,66,875 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తయింది. ఆధార్ సీడింగ్ పూర్తయి, అకౌంట్ సీడింగ్ పూర్తి కానివారు 69,275 మంది ఉన్నారు. మొత్తం ఆధార్, అకౌంట్ సీడింగ్ పూర్తి కానివారు 90,848 మంది ఉన్నారు. సీడింగ్ పూర్తి కాలేదన్న కారణంతో మొత్తం 1,50,123 మందికి సబ్సిడీ అమౌంట్ జమ కావడం లేదు. ఫలితంగా పెరిగిన ధరనుబట్టి వీరిపై నెలకు సుమారు రూ.10.08 కోట్ల భారం పడనుంది.
Advertisement
Advertisement