Vizag LG Polymers GAS Leak: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం - Sakshi Telugu
Sakshi News home page

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం

Published Thu, May 7 2020 6:34 AM | Last Updated on Thu, May 7 2020 1:26 PM

Gas Leakage In LG Polymers Factory In Visakapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. 

గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్‌ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.  

తక్షణమై స్పందించిన అధికార యంత్రాంగం..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భయంతో తలుపులు వేసుకొని ఉండిపోయిన ప్రజలను ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించి వేరే చోటికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్ ఆర్‌.కె.మీనా‌ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎల్‌జి పాలిమర్స్‌లో రసాయన గ్యాస్‌ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ.. ఎల్‌జీ పరిశ్రమలో స్టెరైన్‌ అనే రసాయన వాయువు లీకైందన్నారు.  ఈ రసాయన వాయువు పీల్చి పలువురు అస్వస్థతకు గురవ్వగా వారిని హుటాహుటిన కేజిహెచ్‌ సహా ఇతర ఆస్పత్రులకు తరలించామన్నారు. వైద్య సేవలందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మరో 48 గంటలపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌  పరిశీలించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ..  తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వాయువు పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అధిక సంఖ్యలోనే ఉన్నారన్నారు. కాగా తెల్లవారుజామున గ్యాస్‌ లీకేజీ కావడంతో ఎక్కువమంది అస్వస్థతకు గురయ్యారు. వాయువు లీకైన ప్రదేశాల నుంచి ప్రజల దూరంగా వెళితే బాగుంటుదని సూపరింటెండెంట్‌ వెల్లడించారు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement