
సాక్షి, విజయవాడ: విధుల్లో పోలీసులతోపాటు హోంగార్డులు సమానంగా కష్టపడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 57వ హోంగార్డు వ్యవస్థాపక వేడుకలు విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గౌతమ్ సవాంగ్ హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డులకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. పోలీసులతో సమానంగా హోంగార్డులకు యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ సౌకర్యాన్ని కల్పించామన్నారు. హోంగార్డులకు పోలీసు శాఖ తరపున తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.