ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేంత వరకూ పోరాటం చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు(బారకాసు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేంత వరకూ పోరాటం చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయడం తదితర అంశాలను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రధాన ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొడవలూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో జరిగి ఈ ధర్నాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. జిల్లాకు చెందినవారిలో ఒకరు కేంద్రమంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు.
చంద్రబాబుకు రెండు జేబులు తానేనంటూ గొప్పలు చెబుతున్న మంత్రి నారాయణ జిల్లా విషయంలో మాత్రం ఆ రెండు జేబులు పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు దుగ్గరాజుపట్నంపోర్టుకు అవసరమైన చర్యలు చేపట్టి, పోర్టు నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.25 వేల కోట్లు అవసరమని నిర్ణయించిందన్నారు. నేటి ప్రభుత్వాలు ఆ విషయంలో ఏవేవో కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. విద్యావ్యాపారవేత్తగా ఉన్న నారాయణ నేడు మంత్రి పదవి చేపట్టి కేవలం తన సంస్థలను అభివృద్ధి చేసుకునేందుకే శ్రద్ధ చూపుతున్నారే తప్ప రాష్ట్రంపై చూపడం లేదన్నారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావయ్యా అని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతుంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, మలేషియాలా మారుస్తానని రూ.కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియో గం చేసి ప్రత్యేక విమానంలో పర్యటనలు చేస్తున్నారన్నారు. ‘ప్రజలను మాయమాటలతో మోసం చేసి గద్దెనెక్కావ్.. ఇక ఐదేళ్లు ఏమవుతుందిలే.. అనుకుంటున్నావేమో.. వదిలే ప్రసక్తే లేదు’ అంటూ హెచ్చరిం చారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు జపాన్, సింగపూర్‌కు కుదవపెట్టబోతున్నారని, తానేమి తక్కువ తినలేదని మంత్రి నారాయణ ఏకంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను తాకట్టు పెట్టబోతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఏ విషయం అడిగినా అన్నింటికీ లోటు బడ్జెట్ అంటూ మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. ‘ఇకనైనా నిజం చెప్పు చంద్రబాబూ రాష్ట్ర విభజన విషయంలో మొదటి సంతకం పెట్టింది నువ్వే కదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు అర్థం చేసుకుని ప్రత్యేకహోదా కోసం తాము చేసే పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుశ్రీ, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్రావు, రమణయ్యనాయుడు, చెంచలబాబుయాదవ్, సంగంషఫీ, నగర అధ్యక్షుడు ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ రంగమయూర్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.వినోద్‌రెడ్డి, పిండి సురేష్, బర్నాబాస్, షణ్ముఖం, శివాచారి, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.