జీజీహెచ్‌కు సమగ్ర రూపం
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. జీజీహెచ్‌లోని శుశృత హాలులో మంగళవారం సుమారు 40 ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల వల్ల చెడ్డపేరు వచ్చిందన్నారు. జీజీహెచ్‌ను 50 జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌కు ఒక జిల్లా అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో అధికారికి పది మంది సిబ్బందిని అప్పగిస్తామని, పది రోజులపాటు ఆస్పత్రిలో జిల్లా అధికారులు సిబ్బందితో పనిచేయించి జీజీహెచ్‌కు క్లీన్‌ఇమేజ్ తీసుకురావాలని కోరారు.
ఇంకెంత మందిని చంపుతారు..?
విద్యుత్ సమస్య వల్ల ఆస్పత్రిలో 70 పైగా ఏసీలు పనిచేయడం లేదని, ఏసీలు పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని అంటూ.. ఇంకా ఎంత మందిని చంపుతారు అంటూ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పాడుబడిన భవనాలన్నింటినీ కూల్చివేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, రోగుల సహాయకులు అధిక సంఖ్యలో రాకుండా ఒక రోగికి ఒక్కరు మాత్రమే లోపలకు అనుమతించేలా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
ఒక రోజు వేతనం విరాళం..
ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.2 కోట్ల మేర విరాళాలు సేకరించాలని అధికారులను కోరారు. సమీక్షకు హాజరైన జిల్లా అధికారులందరినీ ఆస్పత్రి అభివృద్ధి కోసం ఒకరోజు వేతనం విరాళం ఇవ్వాలని కోరగా, అందుకు వారు అంగీకారం తెలిపారు. కొత్తపేటలో ఆస్పత్రుల నుంచి రూ. కోటి విరాళం జీజీహెచ్‌కు వచ్చేలా డీఎంహెచ్‌వో కృషి చేయాలని చెప్పారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు రూ.5 లక్షలు విరాళం ప్రకటించిన లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అధినేత డాక్టర్ రాఘవశర్మను అభినందించారు. అక్టోబరు 2న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు వస్తున్నారని, ఆయన వచ్చే నాటికి జీజీహెచ్‌కు రూపు రేఖలు వచ్చేలా అధికారులు పనిచేయాలని వెల్లడించారు. గ్రీన్ గుంటూరు, గ్రీన్ జీజీహెచ్ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల జిల్లా అధికారులను సలహాలు, సూచనలు అడిగారు.
మూడు రోజుల్లో మురికిలేకుండా చూడాలి
జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మూడు రోజుల్లో చిన్న మురికి మరక కూడా లేకుండా ఉండేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు వినియోగించేవారికి నిరంతరం వాటిని పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో కొసన నాగబాబు, నగర పాలక సంస్థ కమిషనర్ సి.అనురాధ, పులిచింతల డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ సీఈవో సుబ్బారావు, డీఎంహెచ్‌వో పద్మజారాణి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్ రాజునాయుడు, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.