
చికిత్స పొందుతున్న మల్లేశ్వరి
కర్నూలు ,ఆదోని: ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని మల్లేశ్వరి నిద్రిస్తున్న మంచానికివిద్యుత్ సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురైంది. చెయ్యి, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే విషయం బయటకు పొక్కకుండా పాఠశాల నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపాల్ సజిదాబేగం అదే గ్రామంలో ఉండే విద్యార్థిని తల్లిదండ్రులు జయలక్ష్మి, నాగేంద్రప్పలకు సమాచారం అందించి.. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స తరువాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాసుపత్రికి రెఫర్ చేశారు. హాస్టలులో పర్యవేక్షణ కొరవడడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా.. ఆమె స్పందించలేదు.