బాలికలు..భళా
సీనియర్ ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థినులు
► బైపీసీలో స్టేట్ టాపర్ సాయి చందన్,
► ద్వితీయ స్థానంలో సింధు
► ఎంఈసీలో నాగసాయి నిర్మలాదేవి స్టేట్ ఫస్ట్
► జిల్లాలో ఆరేళ్లుగా అమ్మాయిలదే అగ్రస్థానం
జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత
► రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం
► పదేళ్లలో అత్యధికంగా నమోదైన ఉత్తీర్ణత ఇదే
► ఫలితాల సాధనలో విద్యార్థుల విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు ప్రభంజనం సృష్టించారు. గత ఐదేళ్లుగా బాలురను అధిగమించి పైచేయి సాధిస్తున్న విద్యార్థినులు ప్రస్తుత ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. మంగళవారం ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతంలో బాలికలే ముందంజలో ఉండగా.... జిల్లాలోనూ సరస్వతీ పుత్రికలే పైచేయి సాధించారు. రాష్ట్రస్థాయిలో 72.07 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా జిల్లాలో 76 శాతంగా నమోదైంది. గత ఏడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించగా, తాజా ఫలితాల్లో నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగింది.
గత ఏడాది రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ దఫా మూడో స్థానానికి ఎదిగింది. మార్చిలో జరిగిన సీనియర్ ఇంటర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 42,305 మంది హాజరు కాగా 32,046 మంది ఉత్తీర్ణులయ్యారు. 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 22,743 మంది బాలురు పరీక్ష రాయగా వారిలో 16,617మంది ఉత్తీర్ణులై, 73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా 19,562 మంది బాలికలు పరీక్షలు రాయగా 15,429 మంది ఉత్తీర్ణత సాధించారు. 79 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. వృత్తి విద్యా కోర్సుల్లో గత ఏడాది 65 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ప్రస్తుతం 68 శాతానికి పెరిగింది. వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు హాజరైన 694 మంది విద్యార్థుల్లో 473 మంది ఉత్తీర్ణుల య్యారు.
బైపీసీలో స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులు....
ఇంటర్ బైపీసీ ఫలితాల్లో గుంటూరులోని భాష్యం మెడెక్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. సీవీ సాయి చందన్ వెయ్యి మార్కులకు 993 మార్కులు, ఎన్. సింధు 991 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచారని భాష్యం విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటించింది. ఇదే సంస్థకు చెందిన ఎన్. ఎల్ రాజేష్ ఎంపీసీలో 991, ఎ. సూర్యతేజ 990 మార్కులు సాధించారు.
ఎంఈసీలో 987 మార్కులతో తెనాలి వివేక జూనియన్ కళాశాల విద్యార్థిని నాగ సాయి నిర్మలాదేవి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే వదిగినేని రమ్య ఎంపీసీలో 993 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈసీలో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని లిల్లీపుష్ప 981, కూచిపూడి వందన 980 మార్కులు సాధించారు.
మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ...
సీనియర్ ఇంటర్లో తప్పిన విద్యార్థులకు మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు మే 5వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. విద్యార్థుల మార్కుల జాబితాలను ఇంటర్‌బోర్డు మే 2వ తేదీ నుంచి ఆయా కళాశాలలకు పంపనుంది.