‘గీతం’ అధినేత మూర్తి దుర్మరణం | GITAM University Head MVVS Murthy dies in accident in US | Sakshi
Sakshi News home page

‘గీతం’ అధినేత మూర్తి దుర్మరణం

Published Thu, Oct 4 2018 2:47 AM | Last Updated on Thu, Oct 4 2018 2:47 AM

GITAM University Head MVVS Murthy dies in accident in US - Sakshi

అమెరికాలో ప్రమాద స్థలం (ఇన్‌సెట్‌) ఎంవీవీఎస్‌ మూర్తి (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి సభ్యుడు, మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. మూర్తి ఆత్మీయులు, స్నేహితులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్‌ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్‌ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ ముందు వెళ్తున్న ఫోర్డ్‌ ఎఫ్‌–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్‌ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్‌ పక్కన శివప్రసాద్‌ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు. 

‘గీతం’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం..
ఎంవీవీఎస్‌ మూర్తి తన సన్నిహితులు వీవీఆర్‌ చౌదరి, గాంధీలను వెట్టబెట్టుకుని సెప్టెంబర్‌ 13న విశాఖ నుంచి అమెరికా పర్యటనకు Ððవెళ్లారు. అప్పటికే అమెరికాలో ఉన్న శివప్రసాద్, బసవపున్నయ్యలు మూర్తిని కలిశారు. అక్కడ గీతం పూర్వ విద్యార్థులతో ఈ నెల 6న జరిగే సమ్మేళనంలో మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్న వార్త బుధవారం తెల్లారేసరికే తెలియడంతో విశాఖ నగరం నిర్ఘాంతపోయింది. ఎంవీవీఎస్‌ మూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య సావిత్రి అనారోగ్యంతో మరణించారు. కుమారులు రామారావు, లక్ష్మణరావు వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. 

‘గోల్డ్‌స్పాట్‌’ మూర్తి
తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మూలపాలెం మూర్తి స్వస్థలం. వ్యాపార నిమిత్తం 1970 దశకంలో విశాఖపట్నానికి వచ్చి స్థిరపడ్డారు. గోల్డ్‌స్పాట్‌ శీతల పానీయాల కంపెనీని స్థాపించి గోల్డ్‌స్పాట్‌ మూర్తిగా పేరుగాంచారు. 1984లో టీడీపీలో చేరిన ఆయన అప్పట్నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు విశాఖపట్నం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 1980లో గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(గీతం) కళాశాలను స్థాపించారు. అనంతరం అది డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గీతం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. 

కలగానే మిగిలిన మంత్రి పదవి 
మంత్రి పదవి చేపట్టాలన్న చిరకాల కోరిక తీరకుండానే మూర్తి కన్నుమూశారు. రెండు దశాబ్దాల నుంచి ఆయన మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ, మంత్రి పదవి దక్కాలంటే ఎమ్మెల్యే కావాలి. కానీ ఏనాడూ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. 2015లో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసినప్పుడు ఆయనలో మళ్లీ మంత్రిపై ఆశలు రేకెత్తాయి. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. 

సీఎం చంద్రబాబుతో బంధుత్వం
ఎంవీవీఎస్‌ మూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత బంధుత్వం ఉంది. ముఖ్యమంత్రి వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెను మూర్తి మనవడు భరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. అలాగే మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు కూడా మూర్తి వియ్యంకుడే. 

మూర్తి మృతదేహం వద్దకు మనవడు 
మూర్తి సన్నిహితుడు, విశాఖకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు డెట్రాయిట్‌లో ఉంటున్నారు. ఆయన బుధవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్‌లో అక్కడి పరిస్థితిని వివరించారు. ‘‘షికాగోలో ఉన్న మూర్తి మనవడు (చిన్న కుమారుడు లక్ష్మణరావు కొడుకు) ప్రమాద వార్త తెలియగానే అలాస్కాకు బయలుదేరాడు. అక్కడి ఆస్పత్రిలో వీరి మృతదేహాలను ఉంచారు. అమెరికా నిబంధనల ప్రకారం మృతదేహాలను వారి బంధువులు గుర్తించాల్సి ఉంటుంది. మూర్తి మనవడు ఆస్పత్రికి వెళ్లి గుర్తించాక పోస్టుమార్టం చేస్తారు. అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపుతారు’’ అని తెలిపారు. 

భౌతికకాయం 7న విశాఖకు! 
ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయాన్ని ఈ నెల 7న విశాఖ నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం భారత్‌కు పంపే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టనుంది. దీన్నిబట్టి ఈ నెల 7న ఆదివారం నాటికి ఆయన పార్థివదేహం రావచ్చని భావిస్తున్నారు. మూర్తి విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం మూర్తి దుర్మరణం వార్త తెలియగానే ఆయన కుమారులు రామారావు, లక్ష్మణరావులు హుటాహుటీన ఆయన ఇంటికి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. 

అమృతలూరులో విషాదఛాయలు 
అమృతలూరు(వేమూరు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్‌ మూర్తితోపాటు మృతిచెందిన వెలువోలు బసవపున్నయ్య(78) స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అమృతలూరు. బసవపున్నయ్య మరణవార్త తెలియగానే అమృతలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. బసవపున్నయ్య తల్లిదండ్రులు వెలువోలు సుబ్బమ్మ, వెంకట సూర్యనారాయణ. ఆయన సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. గీతమ్స్‌ సంస్థ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. వెలువోలు ట్రస్ట్‌ను స్థాపించి, స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement