సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అప్పట్లో తాను విజన్ 2020 రూపకల్పన చేస్తే తనను అందరూ 420 అంటూ ఎద్దేవా చేశారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తొలి గ్రాడ్యుయేషన్ వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
దేశంలో వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలకు తానే కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణకు తానే మార్గదర్శినన్నారు. తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు దేశంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా టెలికాంలోనూ సంస్కరణలు తేవాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కు చెప్పానని చెప్పుకున్నారు.
ఇక తాను రూపకల్పన చేసిన పాలసీల కారణంగానే హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, జినోమ్ వ్యాలీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయని చెప్పారు. జినోమ్ వ్యాలీలోనే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోందన్నారు.
డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్
రూ.500, రూ.2 వేల పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లదనం ప్రవాహం, అవినీతిని రూపుమాపవచ్చని చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీ–4)తో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
తాను అప్పట్లో ప్రైవేట్, పబ్లిక్, పార్ట్‌నర్‌షిప్ (పీ–3) పాలసీతోనే తాను హైటెక్ సిటీని నిర్మించానన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించి అప్పట్లో బిల్‌గేట్స్ తనకు చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చాన్స్‌లర్ వీరేందర్‌సింగ్ చౌహాన్, ప్రెసిడెంట్ ఎం.శ్రీభరత్, వీసీ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment