సర్కారే అసలు దోషి
► అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి ఇస్తేనే బాధితులకు న్యాయం
► అగ్రిగోల్డ్ సొమ్ము తిని ప్రభుత్వం వారికి కొమ్ముకాస్తోంది
► జిల్లాలో రూ.850 కోట్ల బకాయిలు
► ఏజెంట్లకు మరో రూ.50 కోట్లు ఇవ్వాలి
► జిల్లాలోని ఐదుగురు డైరెక్టర్ల జోలికెళ్లడం లేదు
► మరింత మంది ఆత్మహత్యలకు పాల్పడక ముందే న్యాయం చేయాలి
► అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: కోట్లాది రూపాయల సొమ్ముతిని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చంద్రబాబు సర్కార్ అండగా నిలిచిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడీకి అప్పగించిన ఏ కేసులోనూ బాధితులకు న్యాయం జరగలేదని తక్షణం కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడుతున్న బాబు అండ్ కో అసలు దోషులని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆరోపిస్తోంది. జిల్లాలోని 12 అగ్రిగోల్డ్ బ్రాంచీల పరిధిలో 15 వేల మంది ఏజెంట్లు ఉండగా 2.50 లక్షల మంది ఖాతాదారులున్నారు. రూ.850 కోట్లు డిపాజిట్ చేశారు.
ఏజెంట్లకు సంబంధించి మరో రూ.50 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. కానీ పైసా చెల్లించలేదు. దీంతో డిపాజిట్‌దారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ 8 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లోనూ బాధితుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్‌కు కొమ్ముకాస్తోంది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికారపార్టీకి చెందిన కొందరు మంత్రులు, ముఖ్య నేతలు అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తులు తక్కువ ధరకు దక్కించుకొన్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి బాధితుల పక్షాన నిలిచింది. గత అసెంబ్లీతో పాటు తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆ పార్టీ బాధితులకు న్యాయం చేయాలని, కేసును సీబీఐకి బదలాయించాలని డిమాండ్ చేసింది. ఇందు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఆది నుంచి కోర్టు సైతం సీఐడీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఒకదశలో కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ హెచ్చరించింది కూడా. వాస్తవానికి ఈ కేసులో అగ్రిగోల్డ్ యాజమాన్యంతో పాటు డైరక్టర్లను సైతం అరెస్ట్ చేసి గత ఆరు సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలి. కానీ వారు దొరకడం లేదన్న సాకుతో సీఐడీ పట్టించుకోవడం మానేసింది. దీంతో బయటున్న డైరక్టర్లు వారి పేరుమీద ఉన్న బినామీ ఆస్తులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాకు సంబంధించి ఐదుగురు డైరక్టర్లు ఉన్నారు. వీరంతా వందల కోట్ల అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నవారే. ఇప్పటికీ వీరు జిల్లాలో బహిరంగంగానే తిరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. గతంలో ఇద్దరిని అరెస్ట్ చేసినా వారిమీద చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం పై అనుమానాలున్నాయి. న్యాయ వ్యవస్థకు సహకరించక ప్రభుత్వం కేసును నీరుగారుస్తోంది. బాధితులకు వడ్డీతో సహా డబ్బులు రావాలంటే డైరక్టర్లను అరెస్టు చేయాలి. డైరక్టర్లు, ఎస్‌ఆర్‌ఈల వద్ద ఇప్పటికీ కంపెనీకి సంబంధించిన కార్లు ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేదు.
ఇక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న పేరుతో ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న కొందరు చంద్రబాబుతో కుమ్మక్కై తమ స్వార్థంతో ఉద్యమాన్ని నీరనుగార్చే ప్రయత్నానికి దిగారని బాధితుల సంఘం ఆరోపిస్తోంది. బయటమాత్రం కేసును సీబీఐకి అప్పగించాలంటూనే చంద్రబాబు వద్దకు వెళ్లి అప్పగించవద్దని చెబుతున్న వారూ ఉన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని , ముద్దాయిలను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న ఆస్తులతో పాటు బినామీ ఆస్తులను సైతం అమ్మి 3 నెలల్లో బాధితులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు మోజెస్, అద్దంకి కోటేశ్వరరావు, గద్దె జడ్సన్‌లు డిమాండ్ చేశారు.
ఆది నుంచి ఈ కేసులో బాబు సర్కార్ తీరు అనుమానాస్పదంగానే ఉందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో బాబు కుమ్మక్కయారని వారు ఆరోపించారు. తొలుత ఎఫ్‌ఐఆర్ జాబితాలో 19 మంది ఉంటే ఏడుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారు తప్పించుక తిరుగుతున్నారని ప్రభుత్వం ప్రకటించడం మోసపూరితమన్నారు. తప్పించుకు తిరిగేవారి పేర్లు, ఫొటోలు పత్రికలకు ఇస్తే ఎటువంటి పారితోషికం లేకుండానే వారిని పట్టిస్తామని బాధితుల సంఘం చెబుతోంది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.