- అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో
- రెండు రాష్ట్రాలు ఏర్పడగానే డిప్యుటేషన్లు రద్దు
- ఏప్రిల్ 1వ తేదీ కల్లా ఉద్యోగుల పంపిణీపై కేంద్ర సలహా కమిటీ
- విభజన కారణంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగి అరుునా అతని సర్వీసు, సీనియారిటీ, హోదాకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
- కమల్‌నాథన్ కమిటీ ఏప్రిల్ 1లోగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాల రూపకల్పన పూర్తి చేస్తుంది.
- ఏప్రిల్ 1 కల్లా ఉద్యోగుల పంపిణీకోసం కేంద్రం చట్టబద్ధమైన సలహా కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమలనాథన్ కమిటీ మార్గదర్శక సూత్రాలకనుగుణంగా సలహా కమిటీ ఆప్షన్ల ఆధారంగా సీమాంధ్ర, తెలంగాణకు ఉద్యోగుల పంపిణీ జరుగుతుంది.
- ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి వెళ్లాలో నిర్ధారిస్తూ సలహా కమిటీ తొలుత తాత్కాలిక జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలున్నా ఉద్యోగులు సలహా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అభ్యంతరాలను పరిష్కరించాక ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉద్యోగులు, వారి పేర్లతో సహా తుది జాబితాను సలహా కమిటీ ప్రకటిస్తుంది. ఆ తరువాత కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సలహా కమిటీ దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలివ్వండి
Published Tue, Mar 11 2014 1:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతి శాఖలో మంజూరు పోస్టులెన్ని, ఎన్ని ఖాళీలున్నాయి, డిప్యుటేషన్‌పై ఏ శాఖలో ఎంతమంది ఉన్నారనే వివరాలను పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సోమవారం అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖలు ఉద్యోగులకు సంబంధించి పంపిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ఆర్థిక శాఖ సదరు సమాచారాన్ని మరోసారి ధ్రువీకరించాలని కోరుతూ అసలు ఏ శాఖకు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి తదితర వివరాలను త్వరగా పంపాలని మెమోలో కోరింది. జిల్లా కార్యాలయాలకు మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారి సంఖ్య వివరాలను పంపాలని తెలిపింది.
కొన్ని శాఖల్లో వంద పోస్టులు మంజూరు ఉంటే వాస్తవంగా పనిచేస్తున్న వారి సంఖ్య 200 వరకు ఉందని ఆర్థికశాఖ పరిశీలనలో తేలింది. సహకార శాఖ, ఖజానా, రెవెన్యూ శాఖల్లో పోస్టుల మంజూరు, పనిచేస్తున్న వారి సంఖ్యలో వ్యత్యాసం ఉన్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సీమాంధ్రలో, అలాగే తెలంగాణలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉద్యోగులెంతో తెలియాల్సి ఉంది. ఆ వివరాలు వస్తే రెండు రాష్ట్రాల ఏర్పాటు తేదీ జూన్ 2 నుంచి డిప్యుటేషన్లు రద్దు అవుతాయి. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులు తక్కువగా ఉంటే అప్పుడు కొత్తగా డిప్యుటేషన్లపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి.
Advertisement