ఆర్‌ఐ రత్నకుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, డప్పు కళాకారులు
లావేరు: దళిత డప్పు కళాకారులకు 40 సంవత్సరాలికే పింఛన్లు మంజూరు చేయాలని, రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఎన్‌వీ రమణ అన్నారు.
దళిత డప్పు కళాకారులకు 40 సంవత్సరాలకు పింఛన్లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయడానికి ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ డప్పు వాయిద్య కళాకారులు సంఘం ఆధ్వర్యంలో లావేరు గ్రామం నుంచి లావేరులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ దళిత డప్పు కళాకారులు డప్పు వాయిద్యాల నడుమ వినూత్న రీతిలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ జి.రత్నకుమార్‌కు దళిత డప్పు కళాకారుల సమస్యలు, డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గణేష్, ఎన్‌వీ రమణ మాట్లాడుతూ గ్రామాల్లో ఏళ్ల తరబడి దళితులు డప్పు కళాకారులుగా ఉన్నారని, అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపుల్లో వీరి పాత్ర కీలకమైనదన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేది డప్పు కళాకారులేనని అయినా వారిని ప్రభుత్వం డప్పు కళాకారులుగా గుర్తించడం లేదన్నారు. 2014 సంవత్సరంలో ఏపీలో డప్పు కళాకారులు సంఘం పెట్టి పోరాటాలు చేసినప్పుడు డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నేటికి నెరవేరలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో లావేరు మండల కమిటీ దళిత డప్పు కళాకారుల సంఘం నాయకులు ఎచ్చెర్ల లక్ష్మీనారాయణ, ఎచ్చెర్ల రాము, ఎన్.శ్రీను, గొల్లబాబు, రాము, మహేష్, నాగరాజు, డప్పు కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment