ముఖ్యమంత్రికి వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం లేఖ
సాక్షి, అమరావతి: ప్రత్యేక అభివృద్ధి నిధులను తమ నియోజకవర్గాలకు కూడా కేటాయించాల్సిందిగా కోరేందుకు సమయం ఇవ్వాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రతిని పార్టీ శాసనసభాపక్ష విప్, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కార్యాలయంలో అందచేశారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద నిధులు కేటాయించ కుండా తన వద్ద ప్రత్యేకంగా నిధులు ఉంచుకున్నారు.
వాటిని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతలకు మాత్రమే ఇస్తున్నారు. ఈ నిధుల కేటాయింపు కోరుతూ ఐదు రోజుల కిందట సీఎం అపాయింట్‌మెంట్ కావాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష కార్యాలయం సీఎంవోను కోరింది. అయితే వారినుంచి సమాచారం రాలేదు. దీంతో పిన్నెల్లి శనివారం విజయవాడలోని సీఎంవోకు వెళ్లి ఆయన లేకపోవటంతో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్రకు అందించేందుకు ప్రయత్నించారు. ఆయనా లేకపోవటంతో సతీష్‌చంద్ర కార్యాలయంలో లేఖను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కాగా పిన్నెల్లిని కార్యాలయ భద్రతా సిబ్బంది ఎండలో నడిరోడ్డుపైనే దాదాపు 10 నిమిషాలు ఆపేశారు. ఎమ్మెల్యే అయ్యప్ప మాలలో ఉన్నారని చెప్పినా పట్టించుకోలేదు. తరువాత నడుచుకొని వెళ్లేందుకు అనుమతించారు.
కలిసేందుకు సమయం ఇవ్వండి!
Published Sun, Nov 6 2016 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement