
మున్సిపాలిటీ అప్పుల్లో ఉంది.. కలిసికట్టుగా అభివృద్ధి సాధిద్దాం
‘మున్సిపాలిటీ అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటివరకు కోటి70లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.
జమ్మలమడుగు: ‘మున్సిపాలిటీ అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటివరకు కోటి70లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి అభివృద్ధి సాధిద్దామని జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాతిరెడ్డి తులసి పిలుపునిచ్చారు. జమ్మలమడుగు మున్సిపల్ సర్వసభ్య సమావేశం సోమవారం చైర్‌పర్సన్ తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘పాలక వర్గం లేకపోవడంతో నాలుగేళ్లపాటు పాలన అధికారులే నిర్వహించారు.
నీటి పన్ను పెంచడంతో చాలా మంది చెల్లించలేదు. దీంతో బకాయిలుపడ్డాయి. ప్రజలనుంచి పన్నులు వసూలైతేనే మున్సిపాలిటీలో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుంది. మున్సిపాలిటీకి ఇప్పటివరకు రూ.50 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు దొమ్మరనంద్యాల వద్ద ఉన్న ఫిల్టర్ పాయింట్‌లో వాడే ఆలం తదితర వాటికే విపరీతమైన ఖర్చు అవుతోంది. మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులకు జీతాలు కూడా 500వరకు పెంచారు.
ఈ కారణంగా అదనంగా నెలకు మూడు లక్షల వరకు ఖర్చు వస్తోంది. మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఉన్నాయి. వీటిని వసూలు చేసేందుకు కౌన్సిలర్లు కూడా కష్టపడితే తప్ప మున్సిపాలిటీ అప్పుల్లోనుంచి బయటపడే పరిస్థితి కనిపించడలేదు’ అని ఆమె వివరించారు. వైస్‌చైర్మన్ ముల్లా జానీ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.
కృషా ్ణనీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి: ఎమ్మెల్యే
‘జిల్లాలోని ప్రజలకు తాగునీరు, సాగునీరు కావాలంటే తప్పని సరిగా గండికోట ప్రాజెక్టుకు కృష్ణాజలాలు తెప్పించాలి. మున్సిపాలిటీలో ప్రతిపాదన పెట్టి దాని అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. అందుకు టీడీపీ కౌన్సిలర్లు కూడ తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పటికే అవుకు నుంచి గండికోట ప్రాజెక్టు వరకు గాలేరు-నగరి పనులు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిన తర్వాత మిగులు జలాలను శ్రీశైలంనుంచి పొతిరెడ్డిపాడుకు అక్కడినుంచి అవుకు మీదుగా గండికోటకు తరలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నికర జలాలకోసం పోరాటం చేద్దాం: ఎంపీ
కృష్ణాజలాలనుంచి గండికోట ప్రాజక్టుకు నికరజలాలు అందించే విధంగా ఉద్యమించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కరువు ప్రాంతమైన ఈ జిల్లాలోని గండికోటకు నీటిని విడుదల చేయించుకుంటేనే ఈప్రాంత రైతులు, ప్రజలు బాగుపడుతారన్నారు. లేకుంటే కరువు కాటకాలతో అల్లాడాల్సి వస్తుందన్నారు.