
విదేశాల్లో సంపాదించుకుని తిరిగి వచ్చేయండి!
హైదరాబాద్: 'దేశంలోని యువకులు విదేశాలకు వెళ్లండి.. నేర్చుకోండి.. సంపాదించుకుని వచ్చేయండి' అంటూ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచివెళ్లిన యువకులు అక్కడే ఉండటానికి మొగ్గు చూపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మాటలు విదేశాల్లో నివాసం ఏర్పరుచుకున్న యువకులకు ఆగ్రహం తెప్పించినా.. దేశాన్ని నిర్మించడానికి యువత అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాలకు వెళ్లిన అనంతరం అక్కడే ఉండటానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. విదేశాలకు వెళ్లండి.. అక్కడ మీకు అవసరమైనది నేర్చుకోండి.. కానీ సంపాదించుకుని తిరిగి వచ్చేయండి అంటూ తన దైన శైలిలో వెంకయ్య వ్యాఖ్యానించారు. 'మాతృభూమికి సేవ చేయాలనుకుంటే ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న యువత ఇప్పటికైనా వచ్చి దేశ సంక్షేమం కోసం పాటుపడాలి' అని తెలిపారు.
మన దేశంలో ఉన్న అపరిమితమైన జ్ఞానాన్ని, వారి టాలెంట్ ను దేశ సేవ కోసం ఉపయోగించాలన్నారు. యువతో ఉన్న నైపుణ్యం వారి సొంతం కావడానికి మన దేశం, మన నీరే కారణమన్న సంగతి మరవకూడదన్నారు. 'మీరు అమెరికాకు వెళ్లి చూడండి.. అక్కడ ఉన్న 10 మంది డాక్టర్లతో మాట్లాడి చూడండి. సగానికి పైగా మనవారే ఉంటారని ఈ సందర్భంగా వెంకయ్య తెలిపారు.