
సాక్షి, న్యూఢిల్లీ: శాంతి, శ్రేయస్సును కాంక్షించే భారతదేశం బలమైనదని, శాంతికి విఘాతం కలిగిస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలకు సమాధానం ఇస్తూ భారత వైమానిక దళం తీసుకున్న నిర్ణయం గర్వించదగినదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘‘కౌటిల్య ఫెలోషిప్ ప్రోగ్రామ్’’ను అభ్యసిస్తున్న 32 దేశాలకు చెందిన 80 మంది దౌత్యవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన సభల సభ్యులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ సంచాలకులు రామ్ మాధవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పే ‘‘వసుదైక కుటుంబం’’అనే భావన భారత్ తత్త్వమని, అందుకే ప్రతి దేశంతో స్నేహాన్ని, శాంతిని కాంక్షిస్తుందని, దీన్ని బలహీనత అనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా జరిగిన వైమానిక దాడుల నేపథ్యంలో, భారత్ ప్రతి చోటా శాంతిని ప్రోత్సహించాలని కోరుకుంటుందని, అయితే శాంతికి విఘాతం కలిగించి, దేశ భద్రతకు సవాలు విసిరితే మాత్రం ఉపేక్షించమని, భారతీయుల శాంతి కాముకత్వాన్ని బలహీనతగా చూడొద్దని హితవు పలికారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా తీసుకున్న భారత్ నిర్ణయానికి ప్రపంచం మద్దతు అందించడం సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.