ఐఎస్‌బీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
సాక్షి, రాయదుర్గం: స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, అధ్యక్ష తరహాలో ప్రధానిని ప్ర త్యక్షంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా తాము సానుకూలమేనని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరగాలన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, ఐఎస్‌బీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కూడా అన్ని రాజకీయపార్టీలు చర్చించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లోని అధ్యక్షతరహా, దామాషా ఎన్నికల వంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూనే, ఇప్పటికే ఉన్న వ్యవస్థను సరిదిద్దే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని, పార్లమెంటులో 1,000 స్థానాలు ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు.
చట్టవిరుద్ధం కాకూడదు
రాజకీయాల్లో డబ్బు అవసరమేరనని, అయితే అది చట్టవిరుద్ధం కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషనర్ అ««శోక్ లావాసా పేర్కొన్నారు. సెలబ్రిటీల ప్రచారం, పార్టీలకు సొంత మీడియా దగ్గుర్నుంచి అనేక కోణాల్లో ఎన్నికల్లో వ్యయంపై చర్చ జరగాలన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి సీఎంలు ఎన్నడూ మాట్లాడినట్లు తాను చూడలేదన్నారు. ఎన్నికల్లో నమోదైన కేసుల గురించి హోంమంత్రులు పట్టించుకోవటం లేదన్నారు. ఒక పరిధి దాటి ఎన్నికల్లో డబ్బు వ్యయాన్ని కట్టడి చేసే శక్తి ఈసీకి లేదన్నారు
జమిలి ఎన్నికలతో మార్పు రాదు
స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒకేసారి(జమిలి) ఎన్నికలు నిర్వహించటం వల్ల పెద్ద మార్పురాదని ఎఫ్‌డిఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌నారాయణ్ అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను సవరించాలన్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రదీప్‌చిబ్బర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎస్‌బీ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్వినిచాత్ర, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.సి.సూరి, అంతకుముందు సమావేశంలో శివసేన ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది,స్వరాజ్య ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్ జగన్నాథన్ తదితరులు ప్రసంగించారు.
4 అంశాలతో ‘హైదరాబాద్ డిక్లరేషన్’
‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పేరిట రెండ్రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు వేడుకల్లో జయప్రకాశ్ నారాయణ నాలుగు అం«శాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో...
- రాజకీయాల్లో డబ్బు వల్ల కలిగే పరిణామాలపై పౌరుల్లో అవగాహన పెంచాలి. పౌరులు, పౌరసమాజ సంఘాలు, ఎన్నికల సంఘం సమిష్టిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
- పార్టీల ప్రజాస్వామ్య పనితీరును నిర్ధారించడానికి, రాజకీయరంగంలోకి డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. పార్టీలు తమ వార్షిక ఆదాయ,వ్యయాలను సకాలంలో ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస ఆర్థిక సహాయం ఉండాలి.
- రాజకీయాల్లో చట్టవిరుద్ధమైన డబ్బు శక్తి, బహుమతులు ఇవ్వడాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు అవసరం.
- దేశంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీ, ప్రచార వ్యయానికి మించి జరుగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment